శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Mar 04, 2020 , 02:32:45

కరోనాపై భయం వద్దు

కరోనాపై భయం వద్దు
  • అప్రమత్తమైనరాష్ట్ర ప్రభుత్వం
  • విస్తృతంగా కార్యక్రమాలు
  • వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
  • అవగాహనకు పోస్టర్‌ రూపకల్పన
  • జిల్లా అధికారులకు ఆదేశాలు
  • వరంగల్‌ ఎంజీఎంలో ఐసోలేటెడ్‌ వార్డు ఏర్పాటు

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌ రాష్ట్రంలో ప్రవేశించిందనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా ఈ విషయమై ఎక్కువగా చర్చించుకోవడం, దీనికి తోడు సోషల్‌ మీడియాలో రకరకాల వదంతులు వెలువడుతున్న నేపథ్యలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 


వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

హైదరాబాద్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌-19పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జిల్లా వైద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు అందడంతో అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం ఆశ కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కరోనా లక్షణాలు, వ్యాప్తి చెందే అంశాలను గురించి ప్రజలకు వివరించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. 


ప్రత్యేక పోస్టర్‌ రూపకల్పన

కరోనా వైరస్‌కు సంబంధించి జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను ప్రభుత్వ ఆదేశాలతో ప్రజారోగ్య, కుటుంబ 

సంక్షేమశాఖ రూపొందించింది. ఈ పోస్టర్‌ను గ్రామాలు, పట్టణాల్లో జనాలు చదువుకునేలా అంటించనున్నారు. ఇందులో ఈ వైరస్‌ ఏ ఏ దేశాల్లో వ్యాప్తి చెందిందో కూడా పేర్కొన్నారు. ఒక వేళ ఎవరైనా విదేశాలకు వెళ్లి వచ్చినట్లయితే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో ప్రస్తావించారు. ఒక వేళ ఎవరికైనా కొవిడ్‌-19  లక్షణాలు కనిపించినట్లయితే 040-24651119 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని కూడా పోస్టర్‌లో వెల్లడించారు. అయితే మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా 104 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రకటించింది.


అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు  

కొవిడ్‌-19 వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి వైద్యారోగ్య శాఖ సిబ్బంది నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున 630 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. మూడు వేల మందికి ఒక ఏఎన్‌ఎం చొప్పున 225 మంది, 25 వేల మందికి ఇద్దరు చొప్పున హెల్త్‌ సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా 25 వేల జనాభాకు ఒక గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చొప్పున 14, మరో14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు మూడు అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. వీటికి కూడా కొంత ఏరియాను కేటాయించారు. సిబ్బంది నిత్యం ప్రజల్లో తిరుగుతూ కొవిడ్‌-19పై ప్రజలకున్న అపోహలను తొలగిస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఈ వైరస్‌ లక్షణాలున్న వ్యక్తుల విషయం దృష్టికి వస్తే అతడి గత చరిత్ర తెలుసుకొని అతడు కొవిడ్‌-19 వైరస్‌ బారిన పడ్డాడా, లేదా సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు లాంటివా ప్రాథమికంగా నిర్ధారిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్యంపై ఇంకా ఏమైనా అనుమానం వస్తే అతడిని వైద్య చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తారు. 


కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు సిద్ధం

కొవిడ్‌-19 వైరస్‌ మన జిల్లాలో వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాం. ప్రజలు పుకార్లను నమ్మొద్దు. మా సిబ్బంది అవగాహన కల్పిస్తారు.  -లలితాదేవి, జిల్లా వైద్యాధికారి


ఐసోలేటెడ్‌ వార్డు ఏర్పాటు చేశాం

 ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంజీఎంలో 25 పడకల సామర్థ్యంతోఐసోలేటెడ్‌ వార్డును ఏర్పాటు చేశాం. ఎక్కడైనా అనుమానితులు ఉంటే దవాఖానలో డాక్టర్లను సంప్రదించాలి.  


logo