సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Mar 04, 2020 , 02:26:34

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు
  • హాజరుకానున్న 5842 మంది విద్యార్థులు
  • నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
  • నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ
  • 145మంది ఇన్విజిలేటర్ల నియామకం

ములుగు, నమస్తేతెలంగాణ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది మండలాల్లోని 5,842 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. నిరంతర విద్యుత్‌ సౌకర్యంతో పాటు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలతో పాటు పరీక్ష రాసే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రతీ సెంటర్‌లో ఏఎన్‌ఎంను నియమించి అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని ములుగు మండలంలో మూడు సెంటర్లు, ఏటూరునాగారం-రెండు, తాడ్వాయి, వాజేడు, గోవిందరావుపేట, మంగపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక్కో సెంటర్‌ను ఏర్పాటు చేసి మొత్తం తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు తొమ్మిది సెంటర్లకు తొమ్మిది మంది చీప్‌సూపరింటెండెంట్లు, తొమ్మిది మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లతో పాటు 125మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతీ మూడు  సెంటర్లకు ఒక కస్టోడియన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాల్లో ప్రశ్న పత్రాలను ప్రతీ రోజు అందించేందుకు ఆయా పోలీస్‌ స్టేషన్లలో ప్రశ్న పత్రాలను ఇప్పటికే భద్రపరిచారు. ప్రతీ మూడు సెంటర్లకు ఒక కస్టోడియన్‌ సెంటర్‌ నుంచి అధికారులు ప్రశ్న పత్రాలను ఉదయం 8గంటలకు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లి 9గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలలో హాజరయ్యే విద్యార్థులకు అందించనున్నారు. 


జిల్లా వ్యాప్తంగా 5842మంది..

జిల్లా వ్యాప్తంగా 5842 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వీరందరికి ఇప్పటికే తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు జిల్లాలో 2951మంది ఉండగా అందులో 2716 మంది జనరల్‌, 235మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ జిల్లాలో 2891మంది ఉండగా అందులో 2653మంది జనరల్‌, 238మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులందరూ తమ తమ హాల్‌టికెట్లతో ప్రతీ రోజు ఉదయం 8 నుంచి 8:45 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఇప్పటికే విద్యార్థులకు , విద్యాసంస్థలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొమ్మిది గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మాస్‌ కాపియింగ్‌ జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పశ్న పత్రాలను విప్పే క్రమంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ములుగు, ఏటూరునాగారం పోలీస్‌ స్టేషన్లలో భద్రపర్చిన ప్రశ్న పత్రాలను ప్రతీ రోజు ఉదయం చీఫ్‌ సూపరిండెంట్ల ఆధ్వర్యంలో తీసుకొని ఇన్విజిలేటర్లకు అందించే ఏర్పాట్లను పూర్తి చేశారు. 


ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్వాడ్‌ బృందాలతో తనిఖీ 

జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ఒక ఫ్లయింగ్‌, మూడు సిట్టింగ్‌ స్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్వాడ్‌లో రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారి, పోలీస్‌ శాఖ నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇంటర్మీడియట్‌ శాఖ నుంచి సీనియర్‌ లెక్చరర్‌తో కలిపి ముగ్గురు అధికారులను నియమించారు. ఫ్లయింగ్‌ స్వాడ్‌లు నోడల్‌ అధికారి ఆదేశాల మేరకు ప్రతీ రోజు ఆకస్మిక తనిఖీ చేపట్టనున్నారు. అదేవిధంగా సిట్టింగ్‌ స్వాడ్‌ బృందాలు ఆయా పరీక్ష కేంద్రాల్లో మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతీ సెంటర్‌కు ఒక యూనిక్‌ కోర్డ్‌ను ఏర్పాటు చేసి హాల్‌టికెట్లలో వివరాలను పొందుపర్చారు. పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు తమ సెంటర్‌లోని తరగతి గదిని గుర్తించేందుకు నోటీసు బోర్డుల ద్వారా వివరాలను పొందుపర్చేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 


ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

మలుగుటౌన్‌ : నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 4వ తేదీ నుంచి 23 వరకు బస్‌ పాస్‌ కలిగిన విద్యార్థుల నివాసం నుంచి పరీక్షా కేంద్రం వరకు ఏ రూటుకైనా బస్‌ పాస్‌తో పాటు హాల్‌ టికెట్‌ కండక్టర్‌కి చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కావున విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


logo