సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Mar 01, 2020 , 02:57:58

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ఏటూరునాగారం, ఫిబ్రవరి 29 : ఎవరి  ఒత్తిళ్లకు లోను కాకుండా న్యాయశాఖ స్వతంత్రంగా పనిచేస్తుందని, నేడు మనం భద్రంగా బతుకుతున్నా మంటే భారత రాజ్యంగమే కారణమని, రాజ్యాంగానికి లోబడి ఉండాలని జిల్లా జడ్జి,  న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రావు అన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లు భారత రాజ్యంగం ద్వారానే వచ్చాయన్నారు. రాజ్యాంగాన్ని  మూడు భాగాలుగా  రూపొందించారన్నారు.  ఇందులో పార్లమెంట్‌లో చట్టాలు చేస్తారని, వాటిని అమలు చేసే బాధ్యత కలెక్టర్‌, ఎస్పీలకు ఉంటుందని, అమలులో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే బాధ్యత న్యాయశాఖదేనన్నారు. మండల కేంద్రంలోని కుమ్రంభీం స్టేడియంలో శనివారం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా శిబిరం  నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా, డీఎఫ్‌వో ప్రదీప్‌శెట్టి, మహేశ్‌నాథ్‌తో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభాకర్‌రావు మాట్లాడుతూ న్యాయ  సమస్యలు ఉత్పన్నమైనపుడు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరికి చట్టంపై అవగాహన ఉండాలన్నారు.


సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి  మారుమూల ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడంతోపాటు వారికి అందించే బాధ్యతను తెలియచేయడం సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపర  హక్కు కల్పించడానికి భారత ప్రభుత్వం, సుప్రీం కోర్టు సంయుక్తంగా లీగల్‌ సెల్‌ అథారిటీస్‌ యాక్టు 1986లో చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళలు, కార్మికులు, శారీరక దివ్యాంగులు, ఏ మతం వారు  అయినా న్యాయం కోసం కోర్టుకు వెళ్లొచ్చన్నారు.  రూ. 1.5లక్షల  లోపు ఆదాయం ఉన్న వారు న్యాయ సేవాధికారి సంస్థకు దరఖాస్తు చేసుకుంటే వారి తలాయర్‌ను నియమించి కోర్టు ఫీజు కూడా చెల్లించకుడా  కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు.  సంస్థను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.


ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి..

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని  కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు.  ప్రజలను చైతన్య పర్చడం కోసం ఇక్కడ ఈశిబిరం ఏర్పాటు చేశామన్నారు.  ప్రజలు ఆవరణలో ఏర్పాటు చేసిన శాఖల స్టాళ్లను  సందర్శించి పథకాల గురించి తెలుసుకోవాలని సూచించారు. చట్టాలపై విద్యార్థులు కూడా అవగాహన పెంచుకుని తమ తల్లిదండ్రులకు తెలియచేయాలని కోరారు.  


ములుగు మెరుపును నిర్వహిస్తున్నాం..  

 ప్రజలకు సేవలందించడంలో భాగంగా జిల్లాలో ములుగు-మెరుపు కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 250 మందికి వివిధ ట్రైనింగ్‌లు ఇచ్చామన్నారు. తమ వంతుగా సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలపారు.  


ఐటీడీఏ కీలకంగా పనిచేస్తుంది..  

గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ కీలకంగా పనిచేస్తుందని ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా అన్నారు. గిరిజన విద్యార్థుల కో సం ఆశ్రమ  పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. 17 పీహెచ్‌సీలు,  మూడు సీహెచ్‌సీ ద్వా రా వైద్యం అందిస్తున్నామని వివరించారు. దీంతో పాటు 137 అంగన్‌వాడీ కేంద్రాల పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. 200 మంది యువకులకు వివిధ ట్రేడుల్లో శిక్షణ ఇచ్చి ఉ ద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా పీవో పేర్కొన్నారు. శివ్వాపూర్‌లో సబ్బుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎకనామికల్‌ సపోర్టు స్కీమ్‌ను అందిస్తున్నామని వివరించారు. 


ఉపాధి కల్పిస్తున్నాం ..

అడవులను రక్షిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు డీఎఫ్‌వో ప్రదీప్‌ శెట్టి తెలిపారు. జాయింట్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను అటవీ సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నామని, అటవీ ప్రాంతాల్లో అనేక మంది అటవీ ఫలసాయం ద్వారా లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. త్వరలో నిరుపేదలను గుర్తించి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదన కూడా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. 


అందరికీ న్యాయం జరగాలి.. 

 దేశంలోని అందరికీ న్యాయం జరగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహేశ్‌ నాథ్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా ఉచిత న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. ఐటీడీఏ పరిధిలోని 9 గ్రామాల్లో సంక్షేమ పథకాలపై సర్వేచేయడం జరిగిందని, ఇందులో 700 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికి స్కీమ్‌ల గురించి అవగాహన ఉండాలని తెలిపారు. సంస్థ ద్వారా కోర్టుకు వెళ్లకుండా 12వేల కేసులను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించినట్లుగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు 200 వరకు ఏర్పాటు చేశామని, ప్లాస్టిక్‌ ఫ్రీ కోర్టుగా ప్రకటించి  అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమను సంప్రదించాలని ఆయన సూచించారు. రైతు బీమా,  వృత్తి నిర్వహణ కార్డులు, విద్యార్థులకు దుస్తులు, కేసీఆర్‌ కిట్స్‌, పట్టా పుస్తకాలు,ట్రాక్టర్లు, ట్రై సైకిళ్లు తదితర సంక్షేమపథకాలను అధికారులు అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ సురేశ్‌కుమార్‌, డీటీడీవో ఎర్రయ్య, జీసీసీ  డీఎం ప్రతాప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో అప్పయ్య, సీఈవో పారిజాతం, ఆర్డీవో రమాదేవి,  డీపీవో వెంకటయ్య, డిప్యూటీ ఈవో నర్సింహ, తహసీల్దార్‌ సర్వర్‌ పాషా, ఏడీఏ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


15 స్టాళ్ల ఏర్పాటు.. 

శిబిరం నిర్వహణలో భాగంగా ఆవరణలో 15స్టాళ్ల వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రావు,   కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా, డీఎఫ్‌వో ప్రదీప్‌శెట్టి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహేశ్‌నాథ్‌తో పాటు జిల్లా శాఖ అధికారులు సందర్శించారు. ప్రభుత్వం నుంచి అందిస్తున్న పథకాలను స్టాళ్లలో వివరించారు. అటవీశాఖ, ఐసీడీఎస్‌, జీసీసీ, ఎస్సీ కార్పొరేషన్‌, రెవెన్యూ, జిల్లా షెడ్యూల్‌ సహకార సంస్థ , గిరిజన సంక్షేమశాఖ, ఉద్యాన , వ్యవసాయ శాఖలు, న్యాయ సేవాధికార సంస్థ,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు.  


logo