శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 29, 2020 , 02:33:22

సీల్డ్‌ కవర్‌లో ఎవరు?

సీల్డ్‌ కవర్‌లో ఎవరు?

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌, ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవమై జిల్లా సహకార ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన టీఆర్‌ఎస్‌ శనివారం జరిగే డీసీసీబీ, ఓడీసీఎంస్‌ పీఠాలకు అదే ఒరవడిని కొనసాగించబోతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల విషయంలో పార్టీకి స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ ఇన్‌చార్జి, టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లును పరిశీలకులుగా నియమించారు. పార్టీ విధి విధానాలు, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయ రంగ పరిపుష్టికి చేయూతనిచ్చే విధంగా, అన్ని వర్గాలతో విడివిడిగా సమాలోచనలు జరిపి ఏకాభిప్రాయం తీసుకున్న తరువాత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలపై ఎవరుండాలో నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని సీల్డ్‌ కవర్‌లో పొందుపరచి ఆ కవర్‌ను పార్టీ జిల్లా పరిశీలకుడికి అందజేశారు. శనివారం ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులతో హన్మకొండలోని హరిత హోటల్‌లో సమావేశం నిర్వహించిన అనంతరం సీల్డ్‌ కవర్‌లో ఉన్న పేర్లను పరిశీలకుడు వెల్లడిస్తారు. అనంతరం డీసీసీబీ, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌గా పోటీ చేసే వారు నామినేషన్‌ దాఖలు చేస్తారు. అయితే నామినేషన్‌ వేసే దాకా ఆ పీఠాలు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా  మారింది. 


ఆశావహులు ఎవరైనా..అధినేత నిర్ణయమే శిరోధార్యం 

డీసీసీబీ, ఓడీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి పార్టీ అదిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా అందరూ ఏ విధంగా శిరసావహిస్తూ వచ్చారో నేడు జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలోనూ అదే ఒరవడి స్పష్టంగా ఆవిష్కృతం కాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి క్రమశిక్షణగల పార్టీగా, పార్టీ నిర్ణయమే తమ ఆచరణగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీకి కొనసాగింపు మాత్రమే ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అత్యంత  కీలకమైన వ్యవసాయ రంగం పురోగతిలో సహకార శాఖ కీలకంగా మారబోతున్నది. ఈ నేపథ్యంలో పార్టీలో రైతాంగ సమస్యలు, రుణ పరపతి విధానానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నవ్యక్తిగానే కాకుండా పార్టీలో అందరినీ అందరినీ కలుపుకొనిపోవడం, ప్రభుత్వ విధానాలను రైతుల్లోకి తీసుకెళ్లి వారికి మరింత భరోసా ఇచ్చే విధంగా పనిచేసే వారిని, ఆయా సామాజిక వర్గ సమీకరణలను పాటిస్తూ అభ్యర్థుల నిర్ణయం జరిగిపోయిందని, అయితే అధినేత నిర్ణయానికి అనుగుణంగా ఆశావహులు ఆచరిస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.  


మరో రికార్డు దిశగా..

 వరంగల్‌ సహకార ఎన్నికల చరిత్రలో టీఆర్‌ఎస్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్న డైరెక్టర్ల ఎన్నిక ఏవిధంగా అయితే ఏకగ్రీవం అయిందో అదే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా పునరావృతం కాబోతున్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌ (డీసీసీబీ), డీసీఎంఎస్‌ ఎన్నికల్లో తొలిసారిగా అందరికీ అందరూ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్న విషయం తెలిసిందే.   డీసీసీ బ్యాంక్‌ చరిత్రలో టీఆర్‌ఎస్‌ తొట్టతొలిసారి 17 మంది డైరెక్టర్లు, ఓడీసీఎంఎస్‌లో సైతం అదే చరిత్రను ఈనెల 25న లిఖించి రికార్డు నెలకొల్పింది.


డీసీసీబీ  డైరెక్టర్లలో ఎవరా ఇద్దరు? 

వరంగల్‌ సహకార కేంద్ర బ్యాంక్‌ (డీసీసీబీ)లో మొత్తం 20 మంది డైరెక్టర్లకు గాను  17 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.   గ్రూప్‌ -ఏ కేటగిరీ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల ప్రతినిధులుగా) మొత్తం 16 మంది డైరెక్టర్లు, వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లు గ్రూప్‌-బీ కేటగిరిగా సహకార ఎన్నికల రిజిస్ట్రార్‌ నోటిఫై చేశారు. ఇందులో గ్రూప్‌-ఏ కేటగిరిలో ఎస్సీ సామాజిక వర్గానికి మూడు డైరెక్టర్‌ స్థానాలు కాగా, ఇంందులో కేవలం ఒక్క  డైరెక్టర్‌ మాత్రమే ఎన్నికకావడం, మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలసిందే. అదేవిధంగా  గ్రూప్‌ -బీ కేటగిరిలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎన్నిక కావాల్సిన ఒక డైరెక్టర్‌ స్థానానికి సరైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. దీనిపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ 17 మందిలో ఇద్దరు డైరెక్టర్లు ఒకరు చైర్మన్‌గా, మరోకరు వైస్‌ చైర్మన్‌గా ఎంపిక అవుతారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలపై ఎవరిని కూర్చొబెట్టాలి? నిజానికి డైరెక్టర్లుగా ఏకగ్రీవమైన వారిలో అందరికీ అవకాశాలున్నా, పార్టీ నిర్ణయం, వివిధ సామాజిక వర్గాల కూర్పు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పార్టీ ఎవరుండాలో నిర్ణయం తీసుకున్నది.  


ఓడీసీఎంఎస్‌ ఎవరికి... 

ఓడీసీఎంఎస్‌లో మొత్తం 10 మంది డైరెక్టర్లకు గాను ఏడుగురు డైరెక్టర్ల ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ ఏడుగురిలో ఇద్దరికి  (ఒకరికి చైర్మన్‌, మరోకరికి వైస్‌ చైర్మన్‌గా) క్రీయాశీల పదవులు దక్కబోతున్నాయి.  నిజానికి ఇక్కడ కూడా మూడు డైరెక్టర్ల స్థానాలకు సరియైన అభ్యర్థులు లేకపోవడంతో ప్రస్తుతం పాలకవర్గం ఎన్నికకు కావలసిన కోరం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నిక ఈ రోజే పూర్తి అవుతుంది.  గూప్‌-ఏ కేటగిరి కింద ఆరు స్థానాలు ఉండగా ఎస్సీ జనరల్‌ డైరెక్టర్‌ స్థానం,  అదేవిధంగా  గ్రూప్‌-బీలో నాలుగు డైరెక్టర్ల స్థానాలకు గాను  ఎస్సీ జనరల్‌ డైరెకర్టర్‌, ఓసీ జనరల్‌ కేటగిరీలో మరో డైరెక్టర్‌ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.    


logo