సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Feb 25, 2020 , 03:48:11

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ

ఏటూరునాగారం, ఫిబ్రవరి 24: ఐటీడీఏలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. పీవోగా ఐఏఎస్‌ అధికారిని నియమించడంతో తొలి గ్రీవెన్స్‌కు పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని తమ వినతులను పీవో హన్మంత్‌ కొండిబాకు అందించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన గిరిజనుల నుంచి పీవో వినతులు స్వీకరిస్తూ అప్యాయంగా మాట్లాడి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ప్రతీ వినతిపై సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. వెంటనే వాటికి సంబంధించి సమగ్ర సమాచార వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కన్నాయిగూడెం మండలంలో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములను గిరిజనులకు ఇప్పించి హక్కులు కల్పించాలని అదే గ్రామానికి చెందిన పర్శక సంపత్‌ వినతిపత్రాన్ని పీవో హన్మంత్‌ కొండిబాకు అందచేశారు. మరిపెడలోని బాలుర డిగ్రీ కళాశాలలో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా అటెండర్‌గా నియమించాలని అనేపురం గ్రామానికి చెందిన బానుతు నాగేశ్‌ విన్నవించారు. ఆదివాసీ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దబోయిన రవి వినతిపత్రం ఇచ్చారు. 


ములుగులోని ప్రభుత్వ వైద్యశాలలో తనను ల్యాబ్‌ టెక్నీషియన్‌గా నియమించాలని గోవిందరావుపేట మండలం బొల్లెపల్లికి చెందిన బిజ్జి శిల్పి పీవోకు వినతిపత్రం సమర్పించారు. తాడ్వాయి మండలం నార్లాపూర్‌లోని సమ్మక్క-సారలమ్మ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతు చేయాలని కమిటీ అధ్యక్షుడు జీడి బాబు కోరారు. గూడూరులో డీఆర్‌ సేల్స్‌డిపోలో సేల్స్‌మెన్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నానని తనకు ఉద్యోగం ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన భూక్యా కిషన్‌ వినతిపత్రం అందచేశారు. ఖానాపూర్‌ మండలం మంగళవారి పేటలో పూడిక బావుల బిల్లులు చెల్లించాలని భూక్యా లకుపతి కోరారు. ములుగు ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా నియమించాలని వెంకటాపురం మండలానికి చెందిన  సబిహ వినతిపత్రం ఇచ్చారు. వాజేడు మండలం టేకులగూడెంలోని  వృద్ధ గిరిజనులకు వృద్ధాప్యపు పింఛన్లు ఇప్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు పొడెం రత్నం పీవోకు వినతిపత్రం అందచేశారు. మహాముత్తారంలో సాగు చేసుకుంటున్న భూములకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని సాపంల్లి వీరభద్రం కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, మేనేజర్‌ లాల్‌ నాయక్‌, డీటీడీవో మంకిడి ఎర్రయ్య, డిప్యూటీ ఈవో నర్సింహ, జీసీసీ డీఎం ప్రతాప్‌ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్‌, పీఏవో లక్ష్మీప్రసన్న, ఏడీఏ శ్రీధర్‌, ఏసీఎంవో సారయ్య, ట్రాన్స్‌కో ఏఈఈ వాగ్యా నాయక్‌, సీడీపీవో హేమలత, తదితరులు పాల్గొన్నారు.


logo