బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Feb 24, 2020 , 03:27:26

ఓరుగల్లు చైతన్యం గొప్పది

ఓరుగల్లు చైతన్యం గొప్పది

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ): ‘వరంగల్‌ అంటే నాకు అత్యంత ప్రేమ ఉన్నది. విద్యార్థి నాయకుడి దశలో రాజకీయ నాయకుడిగా, మంత్రిగా ఇలా అనేక సందర్భాలు వరంగల్‌ను దర్శించాను. సువిశాల కాకతీయుల సుపరిపాలన కేంద్రంగా వరంగల్‌ కీర్తి ఎంతో గొప్పది. ఆదర్శనీయమైంది. తెలుగు గడ్డను ఏకం చేసిన చైతన్యం వరంగల్‌ది. రాష్ట్రంలో వరంగల్‌కున్న చారిత్రక, సాంస్కృతిక, విద్యా, సాంస్కృతిక, కళా రంగాలకు వరంగల్‌ పెట్టింది పేరు. వరంగల్‌  తెలుగు భాషకు స్ఫూర్తి. తెలుగు భాషకు పట్టం కట్టిన గడ్డ. వానమామలై వరదాచార్యులు, కాళోజీ సోదరులు, వొద్దిరాజు సోదరులు, దాశరథి సోదరులు ఒక తరాన్ని ప్రభావితం చేస్తే, పరిపాలనలో సంస్కర్కణలు చేసిన ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు, జయశంకర్‌  వంటి మహనీయుల్ని అందించిన చారిత్రాత్మక గడ్డ వరంగల్‌.  రామప్ప, పాకాల, వేయి స్తంభాలగుడి.. ఇలా ఒకటా రెండా అనేకం. తెలుగు చరిత్రను, సాంస్కృతిక వికాసాన్ని పరిపుష్టం చేసిన గడ్డ వరంగల్‌ ఇటువంటి గడ్డ మీద చందా కాంతయ్య దూర దృష్టితో ఏవీవీ విద్యా సంస్థను నెలకొల్పడం, ఆ సంస్థ వజ్రోత్సవాలను జరుపుకోవటం, అందులో నన్నూ భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు వరంగల్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.


మాతృభాషా వికసిస్తేనే అభివృద్ధి 

మాతృభాషా వికాసం కోసం తెలంగాణ రాష్ట్రం పట్టుదలతో అడుగులు వేస్తుంది. సీఎం కేసీఆర్‌కు తెలుగు భాష అంటే అమితమైన అభిమానం ఉన్నందువల్లే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఏవీవీ వజ్రోత్సవాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకోవడమే కాదు తెలుగు భాషా వికాసానికి, రాష్ట్ర ప్రగతికి నడుం కట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాదక్షతను ప్రశంసించారు. మాతృభాషా వికాసానికి ప్రభుత్వ చర్యల్ని అభినంధించారు. అమ్మభాషలో ఉన్న ఆత్మీతయను ఉపరాష్ట్రపతి తనదైనశైలిలో వివరించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే  మాతృభాషలు ఉన్నతంగా ఉన్న ప్రాంతాల్లోనే  ఉత్తమైన విలువలు పాదుకొల్పబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలని పేర్కొంటూ మాతృభాషకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న సేవల్ని ప్రశంసించారు. ‘చంద్రశేఖర్‌రావు తెలుగును ఎంతగానో అభిమానిస్తారు. అభిమానించడమే కాదు ఆదరిస్తున్నారు. స్వయంగా భాషాభిమానిగా మాతృభాషను బోధనాభాషగా చేశారు.  కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, చదువుచెప్పిన గురువుల్ని ఆదరించి, ఆచరించిన సమాజం ఎప్పుడూ విలసిల్లుతూ వికసిస్తూ ఉంటాయి’ అని ఆయన  ఉదహరించారు. అమ్మభాష కళ్లవంటివి, పరభాష కళ్లజోడు వంటిది అని ఉదహరిస్తూ ఇతర భాషలు నేర్చుకోవాలి తప్పులేదు. అదే సమయంలో అసలు భాషను నిరీర్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. 


చిరస్మరణీయుడు చందా కాంతయ్య

వరంగల్‌ అంటే సీకేఎం అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. నిజాం ఏలుబడిలో రాజభాషగా ఉర్దూ ఉండఢం వల్ల తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని గ్రహించి చందా కాంతయ్య దార్శనికతతో ఏవీవీ విద్యా సంస్థను నెలకొల్పారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆ మహనీయుడి రుణం తీరాలంటే ఆయన అనుసరించిన మార్గాన్ని ఎంచుకొని సేవాగుణంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.   


సర్వధర్మ సమభావన జాతి అంతస్సూత్రం  

ప్రపంచంలోనే మైనారిటీలు అత్యంత సురక్షితంగా, శాంతియుతంగా ఉన్నది మపదేశంలోనేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కుల, మత, వర్గ, లింగ వివక్షలేకుండా సర్వమతాల సమ్మేళన కేంద్రంగా భారత్‌ వర్థిల్లటానికి మన లౌకితత్వమే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ వర్థిల్లటానికి కారణం ఇక్కడున్న సర్వధర్మ సమానత్వం, సర్వమత సహనం పాటిస్తున్న జాతిగా విరాజిల్లుతున్నదని ఆయన అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు. మహిళల్ని గౌరవించాలన్న భావన ఉండాలే కానీ నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా మార్పులు రావని, ఆ మార్పుల కోసం మానవీయ సమాజ నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన అన్నారు. 


సామాజిక వివక్షను రూపుమాపాలి 

సామాజిక వివక్షను రూపుమాపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. వ్యక్తిత్వం, సామర్థ్యం, చిత్తశుద్ధి, ప్రవర్తన ఇవే ప్రధానంగా ఉండేరోజులు పోయి రాజకీయాల్లో ఇవ్వాళ కులం, మతం, వర్గం, నేరస్వభావం వంటి అంశాలే ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆందోళన చెందారు. ఆదర్శ సమాజ నిర్మాణం కావాలంటే, ఆదర్శ విలువల్ని అందిపుచ్చుకోవాలని, పరస్పర గౌరవాలు, అభిమానం ప్రతీ ఒక్కరూ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పిన జాతిగా ఉన్న మనం ఇవ్వాళ వాటిని తిరిగి పొందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొంటూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుత సహజీవనంవైపు అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. 


చందా కాంతయ్య వంటి మహనీయులు చూపిన దారిలో నడవాలని ఆయన పేర్కొంటూ ఏవీవీ విద్యా సంస్థల వజ్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మికాంతరావు, డాక్టర్‌ బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ మోహన్‌ కందా, ఏవీవీ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ నాగబండి నర్సింహారావు, కార్యదర్శి డాక్టర్‌ చందా విజయ్‌కుమార్‌, వజ్రోత్సవ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌ ఉపేంద్రశాస్త్రి పాల్గొన్నారు. logo