శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Feb 24, 2020 , 03:23:26

మండలంలో ముమ్మరంగా మిర్చికోతలు..!

మండలంలో ముమ్మరంగా మిర్చికోతలు..!

వాజేడు,ఫిబ్రవరి 23: వాజేడు మండలంలో ఈ సంవత్సరం రైతులు 6 వేల ఎకరాలకు పైగా  మిర్చిపంటను సాగుచేశారు. మండలకేంద్రంతోపాటు మండలంలోని ఎడ్జర్లపల్లి, బొమ్మనప ల్లి, పూసూరు, జగన్నాథపురం, కొప్పుసూరు, సుందరయ్యకాలనీ, గుమ్మడిదొడ్డి, దూలపురం, చీకుపల్లి, పెద్దగొల్లగూడెం,పడిగాపురం,కొయవీరాపురం, చింతూరు, ధర్మవరం, లక్ష్మీపురం, పేరూరు, అయ్యవారిపేట, ధర్మవరం, చండ్రుపట్ల గ్రామాల్లో  అధిక మొత్తంలో మిర్చిపంటను సాగుచేశారు. దీంతో మండలవ్యాప్తంగా మిర్చి కోతలు మొదలయ్యాయి.  ఈ ప్రాంతంతో పాటు ఏటూరునాగారం, తాడ్వాయి, చల్వాయి, పస్రా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూలీలను తీసుకొచ్చి ముమ్మరంగా మిర్చికోతలను కోస్తున్నారు. దీంతో  కూలీలకు ఉపాధి లభిస్తోంది. 


 ఎర్రబంగారానికి పెరిగిన ధర ..

గత సంవత్సరం క్వింటా మిర్చి రూ. 8 నుంచి రూ.10వేలు ధర పలికింది. ఈసారి మంచి మద్దతు ధర లభిస్తోంది.  క్విం టాకు రూ.14  నుంచి 15వేలు లభిస్తుంది. మరికొన్ని రోజుల్లో రూ.15 నుంచి రూ.18వేల వరకు కూడా పలుకుతుందని రై తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మండలంలో  బాండ్‌ ద్వారా  మిర్చి సాగుచేసే రైతులకు సంబంధింత  కంపెనీ యాజమాన్యం ఇంకా గిట్టుబాటు ధరను  ప్రకటించక పోవడం తో ఆ రైతులు మద్దతు ధర కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  


ఎర్రబంగారం ధర పైపైకి..

ఎర్రబంగారంగా పిలిచే  మిర్చి ధరలు ఈసారి అమాంతం పైపైకి పెరుగుతుండడంతో దిగుబడి సాధించిన రైతుల్లో  ఆనందం వెల్లివిరుస్తోంది. గతసంవత్సరంతోపోల్చితే  ఈ సారి క్వింటాకు రూ. 5వేలకుపైగా ధర పెరిగింది. దీంతో రైతులు ఈ సంవత్సరం పెట్టుబడులు పోనూ మిగులు సొమ్ముల వస్తాయని ఆశిస్తున్నారు. వాజేడు మండలంలో సాగుచేసే మిర్చికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని గుంటూరు మిర్చి వ్యాపారులు ఇక్కడి మిర్చిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. పద్ధతి ప్రకారం  మిర్చిని పండించడంలో వాజేడు మండల రైతులది అందవేసిన చేయి.  దీంతో ఒకవైపు దళారులతోపాటు మరో వైపు బాండ్‌ కంపెనీలు సైతం ఇక్కడ మిర్చి కోనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు.


 ముడత తెగులుతో తగ్గిన దిగుబడి..

ఈసారి రైతులు మండల వ్యాప్తంగా 6వేల ఎకరాలకుపైగా మిర్చిపంటను సాగుచేసినపట్టికీ కొన్ని చోట్ల ముడత తెగులు సోకి పంట దిగుబడి రాలేదు.  మిర్చికి తెగులు రావడంతో అన్నదాతలు దిగాలుగా ఉన్నారు. ఎకరాకు 20 నుంచి 30 క్విం టాలు పండించే రైతులు తెగులు వలన 10 నుంచి15 క్విం టాలు మాత్రమే దిగుబడి వస్తుందని వాపోతున్నారు. దీంతో ఎకరాకు రూ.లక్షా 50వేలకుపైగా వ్యయం అవుతున్నా దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.  


బిజీబిజీగా కూలీలు..

మిర్చి సీజన్‌ కావడంతో కూలీలు బిజీబిజీగా గాడుపుతున్నారు. మిర్చికోతల వల్ల కూలీలకు చేతినిండా పని దొరికింది.  రోజు వారీ కూలి రూ. 200 లభిస్తుండడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo