సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Feb 24, 2020 , 03:21:54

పన్ను వసూళ్లకు మార్చి డెడ్‌లైన్‌!

పన్ను వసూళ్లకు మార్చి డెడ్‌లైన్‌!

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ: జిల్లాలోని 174 గ్రామపంచాయతీల్లో  పన్నులను ఈ నెల చివరి వరకు 90శాతం , మార్చి నాటికి 100 శాతం  వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి  వెంకయ్య  ఆదేశాలు  జారీ చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ అధికారులు, కార్యదర్శులు ఇంటి పన్నులు, ఇతర  నీటి, లైసెన్స్‌, రహదారి, బందెలు, ఇంటి నిర్మాణ అనుమతులు, అద్దెలతో పాటు ఇతర పన్నులను నూరు శాతం వసూళ్లు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో  వసూలు  చేసిన అన్ని పన్నుల వివరాలను విధిగా ఆన్‌లైన్‌లో నమోదు  చేయాలన్నారు.  


25 వరకు ట్రాక్టర్‌  కొనుగోళ్లు పూర్తి చేయాలి.. 

జిల్లాలో గ్రామపంచాయతీలకు తప్పని సరిగా ట్రాక్టర్‌ ఉండాలన్నారు.  ఇప్పటి వరకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను  కొనుగులు చేయని జీపీలు ఈ నెల 25వ తేదీ వరకు పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ట్రాక్టర్‌ కొనుగోలుకు సరిపడ నిధులు లేని గ్రామపంచాయతీలు ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయా మండల ఎంపీడీవో అనుమతితో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు ములుగు ఏపీజీవీబీ  బ్యాంకులో  లోన్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.


నిధులు సమకూర్చుడంపై దృష్టి..

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని గ్రామపంచాయతీలు  ఆర్థికాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో నిధులు సమకూర్చడానికి ప్రత్యేక దృష్టిని సారిస్తోంది.  ఇందులోభాగంగా తాను  అందజేస్తున్న నిధులతో   పాటు స్థానిక పన్నులను సకాలంలో వసూలు చేయాలని  అధికారులు, ఉద్యోగులు , సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది.  ఈ నేపథ్యంలో జీపీ పరిధిలో ఉండే అనేక రకాల పన్నులను  వందశాతం వసూలు చేయాలని జిల్లా అదికారి ఆదేశాలు  జారీ చేసి, గడువు విధించారు.


నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు...

జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల్లో  వందశాతం పన్నుల వసూళ్లు చేపట్టాలని జిల్లా పంచాయతి అదికారి వెంకయ్య ఆదేశించారు. చేపట్టిన పన్నుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.  ట్రాక్టర్‌ కొనుగోలుకు  సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన  వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


logo