మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Feb 22, 2020 , 03:18:02

బాలగోముడికి మొక్కులు

బాలగోముడికి మొక్కులు

ములుగురూరల్‌, ఫిబ్రవరి 21: కోరిన కోర్కెలు తీర్చే బాలగోముడికి భక్తులు శుక్రవారం పూజలు చేశారు. అంకన్నగూడెంలో నిర్వహిస్తున్న జాతరలో భాగంగా 3వ రోజు మొక్కులు చెల్లించారు. రెండేళ్లకోసారి మేడారం జాతర అనంతరం నిర్వహిస్తున్న ఈ జాతరకు ములుగు, గోవిందరావుపేట, తాడ్వా యి, గంగారం, మహబూబాబాద్‌, కొత్తగూడ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బాలకుమారస్వామిని(గండ్రగొడ్డలి), రోకలి పొన్ను(దూళిముత్తి), బరిసె చిలుగ(కాసాలనాయుడు), కోళ్లకాడు(కాలదారి)కు కొబ్బరికాయలు కొట్టారు. కుటుంబాల సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించారు. వారి రాకతో అంకన్నగూడెం కిటకిటలాడింది. సంతానం లేని మహిళలు గుడి వద్ద వరాలు పట్టారు. సత్యం గల్ల దేవుడు, కోరిన కోర్కెలు తీర్చి కష్టాలను దూరం చేయాలని భక్తులు వేడుకున్నారు. 


మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే సీతక్క 

బాలకుమారస్వామి జాతరలో భాగంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం మొక్కులు చెల్లించారు. కొట్టెం వంశీయులు స్వామివారికి బోనాలు చేస్తుండగా, ఎమ్మెల్యే సీతక్క హాజరై, తలపై బోనం ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ నాడు సమ్మక్క సైన్యంలో బాలకుమారస్వామి వీరోచితంగా పోరాడారని, మారుమూల గ్రామమైన అంకన్నగూడెంలో జరిగే ఈ జాతరకు వేలాది మంది వస్తున్నారని తెలిపారు. జాతరను విస్తృత ప్రచారం చేసి ఘనంగా నిర్వహించాలని కోరారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, పూజారులు, వడ్డెలు, సర్పంచ్‌ చింత శ్యామల, ఎంపీటీసీలు ఈక సరస్వతి కృష్ణయ్య, తిరుపతిరెడ్డి, నాయకులు నల్లెల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 


నేడు వన ప్రవేశం 

అంకన్నగూడెం గ్రామంలో జరిగే బాలకుమారస్వామి జాతరలో భాగంగా స్వామివార్లను శనివారం వనప్రదేశం చేయనున్నారు. తాడ్వాయి మండలం కొడిశాలలోని బిట్రు గట్టుకు దేవుడిని తీసుకెళ్లనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లను పూజారులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్తి చేశారు. 


logo