శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Feb 20, 2020 , 03:03:03

మహా అద్భుతం.. కాళేశ్వరం ప్రాజెక్టు

మహా అద్భుతం.. కాళేశ్వరం ప్రాజెక్టు
  • నదీజలాలను జాగ్రత్తగా వాడుకోవాలి
  • తక్కువ నీటితో జరిగే వ్యవసాయం చేపట్టాలి
  • వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌జీ
  • కేయూలో ‘జల సాక్షరత, నదుల హక్కులు, బాధ్యతల’పై ప్రసంగం

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ దేశంలో నీటి స్పృహ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ అన్నారు. గోదావరి నదికి కొత్త నడకలు నేర్పిన పాలకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని.. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లే అయినప్పటికీ, నదీజలాల వినియోగం, చిన్ననీటి వనరుల పరిరక్షణ విషయంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పటానికి తనకెలాంటి సంకోచంలేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు నీటి ఆవశ్యకత, ప్రజల కష్టాలు బాగా తెలుసుకాబట్టే గోదావరి.. సముద్రంలో కలువడానికి ఇష్టపడటంలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ నీటివిధానాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. గోదావరి జలాల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా నది జన్మస్థలం నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు ఈ నెల 14 నుంచి 22 వరకు తలపెట్టిన యాత్రలో భాగంగా బుధవారం వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రసింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణకు ఆయన ప్రత్యేక ఇం టర్వ్యూ ఇచ్చారు. 


గోదావరి జలాల పరిరక్షణ కోసం మీరు ప్రత్యేకంగా యాత్ర చేపట్టాల్సిన నేపథ్యాన్ని వివరిస్తారా?

గోదావరి.. దక్షిణగంగ. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి తీరప్రాంతాలను పరిపుష్టం చేసే క్రమంలో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ జాతీయస్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుతో రికార్డు నెలకొల్పింది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయి? గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి వంటి వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి? భవిష్యత్‌ ఎలా ఉండబోతున్నదన్న అంశాన్ని తెలుసుకోవటంతోపాటు, ప్రతి ఒక్కరికీ నీటి చైతన్యం పట్ల అవగాహన పెంపొందించాలి. అందుకోసం యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీల పరిశోధన, భాగస్వామ్యాన్ని నాకు తోచినరీతిలో నా అనుభవంలోంచి చెప్పాలని.. గోదావరి పుట్టిన నాసిక్‌ నుంచి ఫిబ్రవరి 14న బయలుదేరాను. నేను చేపట్టిన గోదావరి పరిరక్షణ యాత్ర ఈ నెల 22న రాజమండ్రిలో ముగుస్తుంది. 


మీరు గతంలో కూడా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటికీ ఇప్పటికీ మార్పులేమైనా వచ్చాయా? 

ఆరేండ్ల క్రితం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించాను. అప్పుడు గోదావరిని చూస్తే ఆందోళన కలిగింది. ఇప్పుడు ఆనందం కలుగుతున్నది. గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి వంటి నదుల నీటితో మహారాష్ట్ర కంటే తెలంగాణలో కిలోమీటర్ల పొడవునా నదీప్రవాహం ఉన్నది. అద్భుతమైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. తెలంగాణ కొత్తగా ఏర్పడిందే అయినా వందేండ్ల ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. నీటి వనరుల వినియోగం మాత్రమే కాకుండా.. వాటిని పరిరక్షించాల్సిన అనివార్యతలను గుర్తించిన రాష్ట్రంగా తెలంగాణ అద్భుతమైన నీటిస్పృహతో ముందుకు సాగుతున్నది. వాతావరణ సమతుల్యతను కాపాడటం, ఆరోగ్యవంతమైన, ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించుకోవాలన్న దూరదృష్టితో కూడిన పాలనను ఇక్కడ సీఎం కేసీఆర్‌ చేపట్టారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలకు ఇక్కడిస్తున్న ప్రాధాన్యం మరెక్కడా నేను చూడలేదు. 


గ్రామీణ నేపథ్యాన్ని పురోగమపథంలో నడిపించడం గొప్పవిషయం. ఈ దేశ భౌగోళిక అస్తిత్వాన్ని అందిపుచ్చుకొని అందుకు అనువైన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇవ్వాళ దేశానికే సరికొత్త నీటిపాఠాలు నేర్పిస్తున్నది. తెలంగాణ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. నీటివినియోగంలో తెలంగాణ చేసిన ప్రయోగం ఫలవంతమయ్యేదిశగా ముందుకు సాగుతున్నది. సహజవనరుల పరిరక్షణ, నదీజలాల పరిరక్షణ, వినియోగం విషయంలో యావత్‌దేశం తెలంగాణను కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. రాజ్యాంగంలోని 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు అపారమైన బాధ్యతల్ని ఇచ్చింది. నీటివనరుల వినియోగం అన్నది పరిపాలనలో అంతర్భాగమైన అంశమని చాలామందికి తెలియదు. తెలంగాణ రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొన్నది. మానవీయ ఆర్తిని ఇనుమడింపచేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే మొదట చిన్న నీటివనరుల పరిరక్షణ కోసం చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. తర్వాత భారీ ప్రాజెక్టులను చేపట్టి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టును రికార్డుస్థాయిలో నిర్మించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ కొద్దిగా ప్రయత్నించాయి. కానీ తెలంగాణ అలా కాదు.. ప్రయత్నించి.. ఫలితాలను కూడా రైతులకు అందిస్తున్నది. 


మీరు అనేక రాష్ర్టాలు, దేశాలు పర్యటించారు. ఈ కోణంలో చూసినప్పుడు తెలంగాణ అనుసరిస్తున్న కార్యాచరణపై మీ కామెంట్‌?

మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు సందర్భానికి అనుగుణంగా ప్రజలకు వాగ్దానాలుచేస్తాయి. కానీ ఇక్కడ (తెలంగాణ) అలాకాదు. సహజంగా నీరు కిందికి (పల్లం) ప్రవహిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం పైకి ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలుచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే నీటిని వెనుకకు నడిపించి గోదావరికి కొత్త నడక నేర్పారు. ఇది నిజంగా సాహసోపేతమైన చర్య. ఇటువంటి సాహసాలు ప్రజల యోగక్షేమాల పట్ల చిత్తశుద్ధి ఉన్న పాలకులు మాత్రమే చేస్తారు. నిజానికి నదులను ఇతర నీటివనరుల పరిరక్షణ అన్న స్ఫూర్తి పూర్వకాలంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్పృహ పాలకులకు కొరవడింది. పాలనకు గైడింగ్‌ ఫోర్స్‌గా ఉండే మధ్యతరగతి, మేధావి, విద్యార్థివర్గానికి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిష్ఠస్థాయికి వెళ్లాయి. 


మీ గోదావరియాత్రలో ప్రధానంగా యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలను ఎంచుకోవడం వెనుక కారణమేమిటి? 

ఇప్పటికే యూరప్‌ దేశాల్లో నీటియుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశంలోనూ పలు రాష్ర్టాల మధ్య నదీజలాల వివాదాలు పతాకస్థాయిలో ఉన్నాయి. నీటి వనరుల సంరక్షణ పట్ల ముందుచూపులేదు. రాజకీయ కారణాలూ వీటికి కారణమవుతున్నాయి. గోదావరి వినియోగం, పరిరక్షణ, సఖ్యత వంటి అంశాల్లో తెలంగాణ ఫార్‌ బెటర్‌. తనకు తానుగా ఎగువ (మహారాష్ట్ర) దిగువ (ఆంధ్రప్రదేశ్‌) రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పంతాలకు, భేషజాలకు పోకుండా చిన్నరాష్ట్రమే అయినా పెద్దన్నలాగా వ్యవహరించింది. పరస్పర అవగాహన, ప్రయోజనం, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్న కొత్త చరిత్రకు తెలంగాణ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇవ్వాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రారంభ సమయంలో మిగిలిన రెండు రాష్ర్టాల పాలకులు హాజరై సౌహార్ద సంకేతమిచ్చారు. 


ఇదొక మంచి సంకేతం. ఈ క్రమంలో విద్యార్థులు, టెక్నోక్రాట్లలో అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే నా యాత్ర నాసిక్‌ యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే ఇక్కడి ఇంజినీరింగ్‌ (నిట్‌) కాలేజ్‌, కాకతీయ యూనివర్సిటీ దాకా.. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులతో మాట్లాడుతున్నా. అదృష్టవశాత్తు అందరూ తమ జీవన ప్రమాణాల పెంపుతోపాటు చాలాకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటున్నారు (నవ్వుతూ). అలా సాగాలంటే వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వల ప్రాధాన్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నాం. సమాజ జీవన చిత్రం మార్పుకోసం మనవంతుగా ఏంచేయాలన్నదానిపై ప్రతిఒక్కరిలో అవగాహన కలగాలి. వాటర్‌ లిటరసీ పెరగాలి. 


నీటి నిలువ, పరిరక్షణ, వినియోగం వంటి అంశాల్లో మీరు ఇంకా ఏవైనా సూచనలు చేస్తారా? 

అన్ని నిధుల కన్నా జలనిధులే ముఖ్యమన్న స్పృహ అందరిలో కలగాలి. మిషన్‌ కాకతీయ సందర్భంగా ఇక్కడ కలిగింది. ఇదే విషయాన్ని నేను స్టాక్‌హోం సదస్సులో ప్రస్తావించాను. చిన్ననీటి వనరుల నిర్మాణ వినియోగంలో ప్రజల భాగస్వామ్యం గొప్పగా ఉన్నది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం తొలిదశ పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణదశలో ప్రజల భాగస్వామ్యం సాధ్యం కాదు. రెండోదశ వినియోగం, పరిరక్షణ విషయంలో ప్రజలను భాగస్వాములను చేసేదిశగా ఇక్కడ విధాననిర్ణయాలు తీసుకొంటున్నారని (నీరటి దగ్గరి నుంచి ఈఎన్సీ వరకు వ్యవస్థను బలోపేతంచేయడమే కాదు నీటిసంఘాలను మరింత పటిష్ఠం చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు) తెలిసింది. అది స్వాగతించవలసిన పరిణామం. దీంతోపాటు గోదావరి పరిరక్షణ, వినియోగంపై సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తెలంగాణ.. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి.


ఆరేండ్ల క్రితం గోదావరిని చూస్తే ఆందోళన కలిగింది. ఇప్పుడు ఆనందం కలుగుతున్నది. ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి వంటి నదుల నీటితో మహారాష్ట్ర కంటే తెలంగాణలో కిలోమీటర్ల పొడవునా నదీప్రవాహం కొనసాగుతున్నది. అద్భుతమైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది.  

- డాక్టర్‌ రాజేంద్రసింగ్‌


logo