గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Feb 19, 2020 , 04:19:28

నిరంతరం పల్లె ప్రగతి

నిరంతరం పల్లె ప్రగతి

‘ పల్లె ప్రగతి’ కొద్ది కాలం చేసి ఊరుకునేది కాదు. కేవలం స్పెషల్‌ డ్రైవ్‌లా కాకుండా ఇది నిరంతరం సాగాలి.. జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలి’ అని ఈ నెల 11న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

  • రేపు జిల్లాలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహాలు
  • ఏర్పాట్లు చేసిన అధికారులు..
  • సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఆహ్వానం
  • హాజరుకానున్న మంత్రి సత్యవతిరాథోడ్‌
  • సమ్మేళనం తర్వాత గ్రామాల్లో తనిఖీలు
  • పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం
  • పంచాయతీ రాజ్‌ చట్టాలపై సభ్యులకు మరింత అవగాహన

‘ పల్లె ప్రగతి’ కొద్ది కాలం చేసి ఊరుకునేది కాదు. కేవలం స్పెషల్‌ డ్రైవ్‌లా కాకుండా ఇది నిరంతరం సాగాలి.. జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలి’ అని ఈ నెల 11న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో గురువారం పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆహ్వానాలు పంపించారు. ఈ కార్యక్రమానికి గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించనున్నారు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, ఎవరి బాధ్యత ఏమిటో ఈ సందర్భంగా వివరించనున్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు అందించనున్నారు. 

       - ములుగు, నమస్తే తెలంగాణ


ములుగు, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  ఇందులో భాగంగానే పల్లె ప్రగతి పేరుతో రెండు విడుతలుగా సుమారు 50 రోజుల పాటు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించింది. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ మురుగు  కాల్వలను శుభ్రం చేయడంతో పాటు పాడు బడిన ఇండ్లను కూల్చి వేసి బావులను పూడ్చి వేసింది.  గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేసి సేకరించిన చెత్తను తరలించేందుకు డంపింగ్‌ యార్డులను నిర్మించింది. అలాగే గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందించి పారిశుద్ధ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది.  ఈ నేపథ్యంలో గ్రామాలు మరింత అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని లీలాగార్డెన్‌లో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించనుంది. . ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు ఆహ్వానాలు పంపించారు. ఈ సమ్మేళనం నిర్వహణతో ప్రజాప్రతినిధులు, అధికారులకు గ్రామాల అభివృద్ధిపై మరింత స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది.


 పంచాయతీ రాజ్‌ చట్టాలపై మరింత అవగాహన..

సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఇటీవల నిర్వహించిన కలెక్టర్లు, అడిషనల్‌  కలెక్టర్ల సమావేశంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. జిల్లాలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు సమ్మేళనం కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నిర్వహించే ఈ కార్యక్రమానికి సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీలను ఆహ్వానించారు. పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తమ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. గ్రామ అభివృద్ధిలో  అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను స్పష్టంగా తెలియజేయనున్నారు. 


హాజరుకానున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ 

 జిల్లా కేంద్రంలో గురువారం  నిర్వహించే పంచాయతీ రాజ్‌ సమ్మేళనానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ముఖ్య అతిథిగా హాజరై పల్లె ప్రగతిపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ మొ దటి వారంలో ప్రారంభమైన మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలోని 174 గ్రామపంచాయతీలో 30 రోజుల పాటు కొనసాగింది.  జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగింది.  ఈ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగగా ప్రజాప్రతినిధులు, అధికారులు,  స్థానికుల సహకారంతో గ్రామాలు నూతన శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఈ కార్యక్రమ ఉద్దేశాలను తెలియజేయడంతో పాటు పచ్చదనం పరిశుభ్రతతో కలిగే ప్రయోజనాలను వివరించారు.


కాగా, 2 విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతిలో గ్రామా ల్లో గుర్తించిన సమస్యలను పూర్తి చేసేందుకు ఈ పంచాయతీ రాజ్‌ సమ్మేళనం  ఎంతో దోహద పడనుంది. ఈ సమ్మేళనంలో  గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో.. ఎవరి బాధ్యత ఏమిటో.. వివరించనున్నారు. ఈ సమ్మేళనం  తర్వాత జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను సైతం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీరు  ఏ గ్రామం అభివృద్ధి చెందుతుంది..  ఆ గ్రామ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చాయని తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. 


పల్లె ప్రగతి  నిరంతర ప్రక్రియ:  - వెంకయ్య డీపీవో 

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటిప్పుడు పరిష్కరించేందుకు చేపట్టనున్న  పంచాయతీ రాజ్‌ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.  సమ్మేళనానికి హాజరు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాము. 


logo