శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 19, 2020 , 04:17:29

తెగులు.. దిగులు

తెగులు.. దిగులు

వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన మిర్చి పంట ఈసీజన్‌లో తెగుళ్ల బారిన పడి, ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరీవాహకంలోని మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లో సారవంతమైన నల్లరేగళ్లలో రైతులు వేలాది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు.

  • రైతన్నకు కన్నీళ్లు తెప్పిస్తున్న మిరప సాగు
  • పురుగు సోకి దెబ్బతిన్న పంట
  • కోతకు వచ్చిన మిర్చి.. వెంటాడుతున్న కూలీల కొరత
  • చేతికొచ్చిన దశలో వాతావరణ అననుకూల పరిస్థితులు
  • కొవిద్‌-19 నేపథ్యంలో నిలిచిన ఎగుమతులు
  • మొదట్లో క్వింటాల్‌కు రూ. 20 వేలు పలికిన ధర
  • క్రమేణా తగ్గుతున్న ధర
  • పెట్టుబడులు కూడా రావేమోనని అన్నదాతల ఆందోళన

మంగపేట ఫిబ్రవరి17: వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన మిర్చి పంట ఈసీజన్‌లో తెగుళ్ల బారిన పడి, ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరీవాహకంలోని మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లో సారవంతమైన నల్లరేగళ్లలో  రైతులు వేలాది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే అత్యధికంగా మిర్చి సాగు అయ్యే మండలాలుగా పేరుగాంచాయి. 341, 941, ప్రీతి, 541, 041, దేవనూరు డీలక్స్‌, ఇండికా, తేజ తదితర రకాల మిర్చిని రైతులు సాగు చేశారు. ఇక కౌలు రైతులైతే ఎకరాకు రూ.35 వేల వరకు కౌలు చెల్లించి  సాగు చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టారు.  మిర్చి నాటిన నెల 15 రోజుల తరువాత పంటలకు వరుస తెగుళ్ల వచ్చాయి. 


అప్పటికే రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఏరుకుళ్లు, జెమిని వైరస్‌, బొబ్బెర ముడత, కాండం మచ్చ, గుళ్ల తెగులు రావడంతో రైతులు పరిస్థితిని హార్టికల్చర్‌ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  హార్టికల్చర్‌ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల బృందం దెబ్బ తిన్న మిర్చి పంటలను  పరిశీలించి రైతాంగానికి పంట సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ తెగుళ్ల బారిన పడిన మిర్చి పంటల్లో ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఒక తోటలోని తెగులు మరో తోటకు సోకుతుండడంతో రైతులు మిర్చి తోటల సరిహద్దులో చీరలను ప్రహారీలా ఏర్పాటు చేసుకున్నారు. తెగులు బారిన పడ్డ తోటలోని నీటిని కూడా మరో తెగులు లేని తోటల్లోకి రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినా చాలా మేర మిర్చి దెబ్బతిన్నది. ఒక్కో ఎకరాకు అప్పటికే  రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు తోటలను అర్ధాంతరంగా వదిలేసుకోవాల్సి వచ్చింది. 


వెంటాడుతున్న కూలీల కొరత..

మిర్చి కోతలు ముమ్మరం కావడంతో తీవ్రమైన కూ లీల కొరత ఏర్పడింది. స్థానిక కూలీలతో పాటు వలసొచ్చిన గొత్తికోయల కూలీలతో మిర్చి కోతలు జరుగుతున్నాయి. 

అయితే ఏపీలోని గుంటూరు ప్రాంతానికి చెందిన రైతులు కూడా ఇక్కడి నుంచి కూలీలను తమ ప్రాంతాల్లోని మిర్చి కోతలకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మిర్చి కోతకు వచ్చే కూలీ ఒక్కరికి రూ.200 చెల్లిస్తే, ఏపీ ప్రాంతాని చెందిన రైతులు రూ.350 వరకు చెల్లిస్తామని ఇక్కడి కూలీలను తమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. దీంతో స్థానికంగా కూలీల కొరత ఏర్పడింది. 


కల్లాల్లో దెబ్బతిన్న మొదటి దఫా మిర్చి..

ఇటీవల కురిసిన అకాల వర్షం  మొదటి దఫా కోసిన మిర్చి కల్లాలను తడిపింది. ఇక లోతట్టు ప్రాంతాలు, వాగు తీరాల్లో ఏర్పాటు చేసుకున్న కల్లాల్లో నుంచి వరద నీరు పారి మిరప కాయలు వాగుల్లో కలిసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మొదటి దఫా కోసిన మిరప కాయలు నాణ్యతలో ఉంటాయి. ధర కూడా ఆశాజనకంగా ఉంటుంది. కానీ ఈదశలోనే అకాల వర్షం కురవడంతో వేలాది ఎకరాల మిర్చి పంట కల్లాల్లోనే తడిసింది.  ఫలితంగా మిరప కాయలు రంగు కోల్పోయి, తాలుగా మారిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.  


  ఆందోళనలో రైతాంగం..

ఇటీవల చర్చనీయాంశంగా మారిన కరోనా వైరస్‌ ఉదంతం నేపథ్యంలో మిర్చి ఎగుమతులు నిలిచిపోయి, ధర ఆశా జనకంగా లేకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు.  మొదట్లో మిర్చి క్వింటల్‌కు రూ.20 వేల వరకు ధర పలికింది. ఆ తరువాత పరిణామాలతో ధర క్రమేణా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం  ఏనుమాముల, ఏపీలోని గుంటూరు మార్కెట్లలో  నాణ్యమైన మిర్చి క్వింటాల్‌కు రూ.15, నుంచి 16 వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. నాణ్యత లేని మిర్చికి మాత్రం ధర లభించడం లేదు. మిర్చి ధర మరింత తగ్గుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.  


రూ. 10 లక్షలు నష్టపోయా

- నర్సింహరావు, పొదుమూరు రైతు

మంగపేట శివారులో ఈసీజన్‌లో పది ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశా. పంట వేసిన నెల నుంచి తెగుళ్లు మొదలయ్యాయి. హార్టికల్చర్‌ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో పంటకు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టా. అధికారులు సూచించిన విధంగా  ఖరీదైన మందులను పిచికారీ చేశా. అయినా తెగుళ్లు తగ్గుముఖం పట్టలేదు. పది ఎకరాల  పంట తెగులు సోకి ఎండింది. దీంతో  రూ.  10 లక్షలు నష్టపోయా. ప్రభుత్వం మిర్చి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.


logo