బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Feb 19, 2020 , 04:09:55

శివరాత్రికి రామప్ప ముస్తాబు

శివరాత్రికి రామప్ప ముస్తాబు

మహాశివరాత్రిని పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయం ముస్తాబైంది. పరమేశ్వరుడి ఆరాధనతో భక్తజనం తరించేందుకు రామప్ప దేవాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

  • మూడు రోజులపాటు ఉత్సవాలు
  • 21న రామలింగేశ్వరుడి కల్యాణం
  • సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు
  • జాగరణకు సిద్ధమైన భక్తులు
  • భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా
  • అన్ని సౌకర్యాలు: ఈవో

మహాశివరాత్రిని పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయం ముస్తాబైంది. పరమేశ్వరుడి ఆరాధనతో భక్తజనం తరించేందుకు రామప్ప దేవాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు రామప్ప దేవాలయం ముస్తాబవుతున్నది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరు

కానున్నారు.         


మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వరస్వామి కల్యాణానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులు నిలుపుకునేందుకు అధికారులు పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్ల్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాచకొండ శ్రీనివాస్‌ తెలిపారు. ములుగు, పరకాల, హన్మకొండ ప్రాంతాల నుంచి రామప్ప దేవాలయానికి గంటకు ఒక బస్సు సర్వీసును నడిపిస్తున్నారు. మూడు రోజుల పాటు రామప్పలో వైద్య సేవలు అందించనున్నట్లు వైధ్యాధికారి శ్రీనివాస్‌, వెంకటలక్ష్మీలు తెలిపారు. రామప్పలో ఎలాంటి విద్యుత్‌ సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. 


మహాశివరాత్రి కార్యక్రమాలు

21న శుక్రవారం ఉదయం 4.30గంటలకు సుప్రభాతం, 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతిపూజ, అఖండదీపారాధన, పుణ్యహవచనం, అంకురార్పన, రక్షాబంధనం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు కోమళ్ళపల్లి హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తెలిపారు. రాత్రి 10గంటలకు ఆలయంలో  అంగరంగవైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించనున్నట్లు పేర్కొన్నారు. 22న శనివారం ఉదయం 5గంటలకు సుప్రభాతసేవ, గణపతిపూజ శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, 11గంటల నుంచి గణపతి పూజ, గ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, సాయంత్రం భద్రకాళీపూజ, సహస్రనామార్చన, బలిహరణము రాత్రి దీపోత్సవం, ఇదే రోజు తెల్ల్లవారు జామున 4గంటలకు అగ్నిగుండంలో నడుచుట.. 23న ఆదివారం ఉదయం సుప్రభాతం, గణపతిపూజ, రుద్రాభిషేకం, 8గంటలకు నాగబలి, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


100 మంది పోలీసులతో బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా రామప్పలో 100మంది పోలీసు సిబ్బందితో మూడు రోజుల పాటు బందోబస్తు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్సై భూక్య నరహరి తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే 94409 04637, 94407 00586 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.logo