శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Feb 15, 2020 , 02:37:52

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం
  • 10సొసైటీ స్థానాలకు ఎన్నికలు
  • మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌

ములుగు, నమస్తేతెలంగాణ : జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు జిల్లా సహకారశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 12 పీఏసీఎస్‌లకుగాను వాజేడు, పాలంపేట పీఏసీఎస్‌లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మిగిలిన 10 పీఏసీఎస్‌లు అయిన ములుగు, వెంకటాపూర్‌, నర్సాపూర్‌, లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట, తా డ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(నూగూరు), ఇంచర్ల సహకార సంఘాలకు రేపు ఎన్నికలు జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయా సహకార సంఘాల పరిధిలో మొత్తం 156టీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా నామినేషన్‌ల ఉపసంహరణ తేదీ నాటికి 67టీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 89టీసీలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 23,040మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా ఏకగ్రీవమైన టీసీల పరిధిలోని సభ్యులు పోను మిగిలిన 15,296 మంది సభ్యులు శుక్రవారం తమ ఓటు హక్కును బ్యాలెట్‌ పద్ధతి ద్వారా వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి  చేశారు. 


సహకార ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఎప్పటికప్పుడు  సమీక్షిస్తూ తగు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా సహకార యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు.  ఉదయం 7గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా 10 పీఏసీఎస్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్‌ను ప్రారంభించి 1గంటల వరకు సభ్యులు ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి లెక్కింపును ప్రారంభించి సాయంత్రం లోగా విజేతలను ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో డీసీవో నాగనారాయణ, తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి, రాష్ట్ర ఎలక్షన్‌ అబ్జర్వర్‌ మాలోతు వాల్యానాయక్‌ సమక్షంలో ఎన్నికల  సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. 


పోలింగ్‌కు బ్యాలెట్‌ పేపర్లు, 100 బ్యాలెట్‌ బాక్స్‌లు రెడీ 

నేడు జిల్లా వ్యాప్తంగా 10 సొసైటీలలో నిర్వహించే ఎన్నికల కోసం బ్యాలెట్‌ పేపర్లతోపాటు 100 బ్యాలెట్‌ బాక్స్‌లను ములుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చి శుక్రవారం బ్యాలెట్‌ బాక్స్‌లతోపాటు ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులకు పంపిణీ చేశారు. జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణను సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌ వాల్యానాయక్‌ పర్యవేక్షణలో 20మంది ఎన్నికల అధికారులను, 96మంది ప్రిసైడింగ్‌ అధికారులను నియమించడంతోపాటు 154మంది ఇతర సిబ్బందిని నియమించి మొత్తం 278మంది సిబ్బందికి ఎన్నికల విధులను కేటాయించారు. జిల్లాలోని ములుగు, ఇంచర్ల, ఏటూరునాగారం, వెంకటాపూర్‌, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట వెంకటాపురం(నూగూరు), లక్ష్మీదేవిపేట, నర్సాపూర్‌ పీఏసీఎస్‌ల ఎన్నికల నిర్వహణకు 5రూట్లుగా విభజించి రూట్‌ అధికారులను నియమించడంతోపాటు 3 జోనల్‌ అధికారులను నియమించారు. ములుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు  చేశారు. 


వీరందరికీ ఓటింగ్‌కు అవసరమైన సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు పోలింగ్‌ పూర్తయిన తర్వాత శనివారం సాయంత్రం మరల రిసెప్షన్‌ కౌంటర్‌లో ఎన్నికల సామగ్రిని తిరిగి తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం ఆయా పీఏసీఎస్‌ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు బ్యా లెట్‌ పద్ధతిన పోలింగ్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భోజన విరామం అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టి  సాయంత్రం లోగా ఫలితాలను వెల్లడించనున్నారు. రేపు (ఆదివారం) ఉదయం 9గంటలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించేందుకు సహకార ఎన్నికల అధికారులు సమాయత్తం అవుతున్నారు. సహకార నియమనిబంధనల ప్రకారం ఆదివారం పాలకవర్గాల ఎన్నికకు పూర్తి ఫోరంతో పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఓటింగ్‌ ప్రకారం  ఎన్నుకోనున్నారు. ఒక వేళ పూర్తి ఫోరంతో పాలకవర్గ సమావేశం ఏర్పాటు కానట్లయితే 3రోజుల్లో మరల ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. logo