శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Feb 14, 2020 , 04:11:02

సీఎం పర్యటన సక్సెస్‌

సీఎం పర్యటన సక్సెస్‌

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 13: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. కాళేశ్వరం, మేడిగడ్డలో సీఎం రెండు గంటల పాటు గడిపారు. కాళేశ్వరం చేరుకున్న ఆయనకు ముక్తీశ్వరస్వామి దేవస్థాన ట్రస్టు చైర్మన్‌ బొమ్మెర వెంకటేశం, ఆలయ ఈవో మారుతి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు సీఎం కేసీఆర్‌, మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని విజయ గణపతి వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అక్కడి నుండి పార్వతీ అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం శివ కల్యాణ మండపంలో అర్చకులు సీఎం కేసీఆర్‌, మంత్రులకు ఆశీర్వచనం చేయగా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌, ఆలయ ఈవో మారుతి, ట్రస్టు చైర్మన్‌ వెంకటేశం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేశ్‌ స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించి స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. మధ్యాహ్నం 1.10 గంటలకు కాళేశ్వరం చేరుకు న్న సీఎం గంటపాటు కాళేశ్వరంలో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి 1.52 గం టలకు హెలీప్యాడ్‌ వద్దకు చేరుకొని 2.08 గంటలకు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌ను గగనతనంలో నుంచి వీక్షించారు. లక్ష్మీ బరాజ్‌ వద్ద 45 నిమిషాల పాటు గడిపి అధికారులతో ప్రాజెక్టు అభివృద్ధి విషయమై చర్చించారు. అక్కడి ఇల్లందు గెస్ట్‌హౌస్‌కు చేరుకొని భోజనం చేసి 30 నిమిషాల్లో తిరిగి కరీంనగర్‌కు వెళ్లిపోయారు. 

 సీఎంకు ఘనస్వాగతం

కాళేశ్వరం, మేడిగడ్డలో సీఎంకు నేతలు  ఘనస్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌కు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, ఐజీ నాగిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత,  జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, జెడ్పీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ చల్లా నారాయణరెడ్డి, మహదేవపూర్‌ ఎంపీపీ బాన్సోడ రాణీబాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ, కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమ త, సర్పంచ్‌ వెన్నపురెడ్డి వసంత, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు,ఎంపీటీసీలు మమత, జయశ్రీ, టీఆర్‌ఎస్‌ మహాదేవపూర్‌ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు, నాయ కులు సెగ్గం సిద్ధు, బుర్ర రమేశ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సీఎం కేసీఆర్‌ను శాలువాతో సత్కరించారు.  

 పోలీసుల భారీ బందోబస్తు

సీఎం పర్యటన నేపథ్యంలో ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, ఓఎస్డీ శోభన్‌కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు సుమారు 20 కిలోమీటర్ల పొడవున పోలీసులు మోహరించారు. సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ములుగు, జయశంకర్‌ జిల్లాల అదనపు ఎస్పీలు సాయిచైతన్య, శ్రీనివాసులు, ట్రైనీ ఐపీఎస్‌ బాలస్వామి, డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   సీఎం సెక్యూరిటీ వింగ్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

 సీఎం సమక్షంలో చేరికలు

  సీఎం సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరా రు. మంథని, భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి ఆధ్వర్యంలో విలాసాగర్‌ సర్పంచ్‌ జనగామ రమాదేవి వెంకటనర్సింగరావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీసీఎంఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దబ్బెట రాజేశ్‌ టీఆర్‌ఎస్‌లో చేరగా సీఎం వారిని అభినందించారు. 


logo