గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Feb 14, 2020 , 04:05:11

బాలింత మృతి

బాలింత మృతి

అంబేద్కర్‌ సెంటర్‌, ఫిబ్రవరి13: భూపాలపల్లి మండలంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవించిన మహిళ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో హన్మకొండలోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతురాలి భర్త రామకృష్ణ, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి మండలంలోని ఎస్‌ఎం కొత్తపల్లికి చెందిన తరాల మౌనిక(23) ఈ నెల 11న భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానలో డెలివరీ కోసం చేరగా అదేరోజు డెలివరీ చేసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, డెలివరీ తర్వాత మౌనికకు రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు సూచించారన్నారు. ఈ మేరకు రక్తం తీసుకురాగా డెలివరీ రోజున మౌనికకు రక్తం ఎక్కించాల్సి ఉండగా మరుసటి రోజు ఎక్కించారని చెప్పారు. దీంతో మౌనిక తీవ్ర అస్వస్థతకు గురైందన్నారు. మౌనికకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని, ఈ విషయం డాక్టర్‌కు తెలుపగా డాక్టర్‌ స్నిగ్ధాసంస్కృతి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. అలాగే, భూపాలపల్లిలోని పలు ప్రైవేటు దవాఖానల వైద్యులు వచ్చి మౌనిక పరిస్థితిని పరిశీలించారు. పరిస్థితి విషమించిందని గమనించిన వైద్యులు హన్మకొండలోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పి మధ్యాహ్నం 3గంటలకు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందన్నారు. దీంతో మృతురాలి బంధువులు దవాఖాన ఎదుట ధర్నాచేశారు. మౌనిక మృతికి దవాఖాన యాజమాన్యమే కారణమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సుమారు 2గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, మౌనిక మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మృతురాలికి భర్త రామకృష్ణ, రెండేళ్ల కుమారుడు, రెండ్రోజుల క్రితం జన్మించిన పాప ఉన్నారు. కాగా, డాక్టర్‌ స్నిగ్ధాసంస్కృతిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించింది. ఇదిలా ఉండగా, దవాఖాన నిర్వాహకుడు కల్యాణ్‌ చక్రవర్తి విలేకర్లతో మాట్లాడుతూ.. మౌనిక పరిస్థితి విషమించగా ఆమె బంధువులు హన్మకొండకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో హార్ట్‌స్ట్రోక్‌తో మృతి చెందిందని చెప్పారు.


logo