శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 12, 2020 , 04:39:26

ఓరుగల్లుకు ‘క్వాడ్రంట్‌'

 ఓరుగల్లుకు ‘క్వాడ్రంట్‌'

 మడికొండ(వరంగల్‌), ఫిబ్రవరి 11: ఓరుగల్లుకు మరో ఐటీ కంపెనీ రానుంది. మడికొండలోని ఐటీ పార్కులోని ఎకరం స్థలంలో క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన బ్రాంచిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఈ నెల 16న బ్రాంచి భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. కాగా ఇప్పటికే మడికొండలోని ఐటీ పార్కులో దిగ్గజ కంపెనీలైన టెక్‌ మహేంద్ర, సైయంట్‌ కంపెనీలు తమ బ్రాంచిలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీ మైడ్‌ ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాలను సాగించేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీల్లో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత విస్తరిస్తున్న ద్వితీయ శ్రేణి నగరం వరంగల్‌కు ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా తరలివస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ కంపెనీని కూడా మడికొండలో ఏర్పాటు చేయనుండడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. 

వరంగల్‌ టు అమెరికా..

 ఈ నెల 16న భూమిపూజ చేయనున్న క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి వరంగల్‌ జిల్లావాసి. నగరంలోని హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీ(శ్రీనగర్‌ కాలనీ)కి చెందిన మురళీధర్‌రెడ్డి, మణిమాల కుమారుడు. ఈయన పదో తరగతి వరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో శ్రీగురుకుల విద్యాలయంలో చదువుకున్నారు. ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ప్రముఖ విప్రో కంపెనీలో అకౌంట్స్‌ మేనేజర్‌గా, అమెరికాలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేశారు. 2004లో అక్కడే క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ యూకే, కెనడా, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో బ్రాంచిలను స్థాపించారు. ప్రస్తుతం వరంగల్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు తన నూతన బ్రాంచిని స్థాపించబోతున్నారు. 


logo