శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Feb 12, 2020 , 04:35:13

ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డున పడొద్దు

ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డున పడొద్దు

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 11 : సింగరేణి ఉద్యోగాన్ని పోగొట్టుకొని రోడ్డున పడవద్దని ఏరియా సింగరేణి డీజీఎం (పర్సనల్‌) మంచాల శ్రీనివాసరావు కార్మికులకు సూచించారు. భూపాలపల్లి ఏరియాలో విధులకు తరచూ గైర్హాజరయ్యే కార్మికులకు మంగళవారం పట్టణంలోని కృష్ణకాలనీలో గల సింగరేణి ఫంక్షన్‌ హాల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు ఏడాదికి వంద మస్టర్లు కూడా చేయని కార్మికులను వారి కుటుంబ సభ్యులతో పిలిపించారు. ఈ కార్యక్రమానికి డీజీఎం (పర్సనల్‌)తోపాటు డీవైసీఎంవో డాక్టర్‌ ఎస్‌ పద్మజ, డాక్టర్‌ రవికుమార్‌, టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేశ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చాలా మంది కార్మికులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారని, ఏడాదికి వంద మస్టర్లు సైతం చేయడం లేదన్నారు. దీంతో ఉద్యోగాలు కోల్పోయి కుటుంబంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, మరోమారు ఉద్యోగం ఇవ్వాలని తిరుగుతున్నారన్నారు. మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఒక్కో కార్మికుడిని, వారి కుటుంబ సభ్యులను వేదికపైకి పిలుస్తూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా..? అని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు సక్రమంగా విధులు నిర్వహించేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో సంక్షేమాధికారి పీ రాజేశం, సేవా సభ్యులు సరళ, అరుణ, ఆయా గనుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు. 


logo