మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Feb 11, 2020 , 03:36:19

నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

 నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేటలోని అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. వరంగల్‌ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో దాత సాయంతో అభయాంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. 22 అడుగుల అతిపెద్ద అంజనేయస్వామి విగ్రహంతోపాటు ఆలయం కూడా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రతి ఏటా ఇక్కడ భక్తులు మాలలు ధరించడంతోపాటు విరమణ కూడా చేస్తారు. హనుమాన్‌ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయ కమిటీ ఏర్పాట్లు.. 

 ఆలయంలోనే ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేసేందుకు దాత ముందుకు వచ్చారు. మొదట కేవలం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ, ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించాలని తర్వాత నిర్ణయించారు. దీనిలో భాగంగా 22 అడుగులు అభయంజనేయ స్వామి విగ్రహం నిర్మించారు. ఆంజనేయ విగ్రహం కింద ఆలయ నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇందులో దేవతామూర్తులను ప్రతిష్ఠించే కార్యక్రమాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.

నిత్య పూజలు..

అయ్యప్ప ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం చేయడం వల్ల నిత్య పూజలు జరుగనున్నాయి. వేదబ్రాహ్మణులను కూడా ఇందులో నియమించి నిత్య ధూపదీప నైవేద్యాలను స్వామి వారికి అందించే ఏర్పాట్లు చేశారు. దాత బొద్దుల దివాకర్‌ తన తండ్రి జ్ఞాపకార్థం ఆలయం నిర్మించాలని ముందుకు వచ్చారు. బొద్దుల శేషయ్య జ్ఞాపకార్థం బొద్దుల ఉదయమ్మ, బొద్దుల త్రివేణి దివాకర్‌, బొద్దుల నాగరాజు ఆలయ నిర్మాణం చేశారు.  

15న మహా అన్నదానం

ఆలయంలో మంగళవారం నుంచి విగ్రహాప్రతిష్ఠాపనోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈనెల 15 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నందిగామ వాస్తవ్యుడు రామకృష్ణ చేతుల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు తరలిరానుండడంతో పలు ఏర్పాట్లు చేశారు. ఈనెల 15వ తేదీన మహాన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo