గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 11, 2020 , 03:35:20

ఆర్టీఐ కమిషనర్‌గా శంకర్‌నాయక్‌

ఆర్టీఐ కమిషనర్‌గా శంకర్‌నాయక్‌

నెహ్రూసెంటర్‌, ఫిబ్రవరి 10 : సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండలం, బావోజీగూడెం గ్రామ శివారు బోజ్య తండా కు చెందిన గుగులోత్‌ శంకర్‌నాయక్‌ను నియమిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 23ను విడుదల చేసింది. మారుమూల తండాకు చెందిన శంకర్‌నాయక్‌  ఓయూలో డాక్టరేట్‌గా, అందరికీ అత్యంత ఆప్తుడిగా, కల్మశం లేని మంచి మనిషిగా గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉద్యమ ప్రస్థానం కొనసాగింది. తెలంగాణ ఉద్యమంలో యువ కెరటం, మారుమూల తండా నుంచి తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ జేఏసీ, రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలు ఎదిగిన క్రమం నేడు సమాచారం హక్కు చట్టం కమిషనర్‌గా ఎంపిక చేసింది.  మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బాబోజీగూడెం గ్రామ శివారు బోజ్యాతండాకు చెందిన భాగ్యానాయక్‌, సాలమ్మ దంపతులకు మూడో సంతానం శంకర్‌నాయక్‌. ఇతడి విద్యాభ్యాసం అదే గ్రామంలో రెండో తరగతి వరకు జరిగింది. 3 నుంచి 7వ తరగతి వరకు సీతారాంపురం ఉన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు మరిపెడ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ.ఏ, సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(హెచ్‌సీయూ)లో ఎం.ఏ పూర్తి చేశారు. పాలమూరు యూనివర్శిటీ నుంచి బీఈడీ పూర్తి చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో ఎం.ఫిల్‌, ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటం  చేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో అనేక పోరాటాల్లో భాగంగా రాష్ట్ర సాధనకు ప్రముఖపాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గిరిజనులకు అందేలా వారికి అవగాహన కల్పించారు. దీనికి తోడు పలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో శంకర్‌నాయక్‌ ప్రముఖ పాత్ర పోషించారు. గిరిజనుల అభివృద్ధికి, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించిన శంకర్‌నాయక్‌ను సీఎం కేసీఆర్‌ గుర్తించి రాష్ట్రస్థాయిలోనే ప్రముఖ స్థానం కల్పించారు. 


logo