బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Feb 10, 2020 , 03:32:41

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ కృష్ణఆదిత్య

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ కృష్ణఆదిత్య
  • పారదర్శకంగా పాలన అందిస్తా..
  • అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచన
  • విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యత
  • ప్లాస్టిక్‌ రహిత ములుగు జిల్లాకు చర్యలు
  • పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి


ములుగు, నమస్తేతెలంగాణ : ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానని కలెక్టర్‌ ఎస్‌. కృష్ణఆదిత్య అన్నారు. ములుగు కలెక్టర్‌గా ఆదివారం ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడా రం జాతర విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు పాత్ర పోషించారని అన్నారు. జాతర అనంతరం పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధికి  అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. ప్లాస్టిక్‌ రహిత ములుగు సాధనకు కట్టుబడి ప్రత్యేక కార్యాచరణతో ముదుకువెళ్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అడవుల ఖిల్లా ములుగు జిల్లా  పర్యాటక రంగానికి ఎంతో అనువుగా ఉందని, ఈ దశలో పర్యాటక రంగ అభివృద్ధికి  ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు  తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఆర్టీవో కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ  ఆదిత్యకు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులతో పాటు ఇతర శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు, ఐటీడీఏ  నూతన పీవో జండెజ్‌ హన్మంత్‌కొండిబా, డీఆర్వో కూతాటి రమాదేవి, కలెక్టరేట్‌ కార్యాలయ ఏవో శ్యామ్‌, అధికారులు చక్రధర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ వసంతరావు, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. 


logo