శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Feb 09, 2020 , 02:38:20

విశ్వాసం విశ్వవ్యాప్తం..

విశ్వాసం విశ్వవ్యాప్తం..

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:  గుడి లేదు. గోపురం లేదు. అర్చనలేదు. అభిషేకం అంతకన్నా లేదు. తీర్థం లేదు. లడ్డూ ప్రసాదాల పంపిణీ లేదు. మడిలేదు. మంగళహారతి లేదు. కొలవడానికి ఓ రూపం లేదు. కలవడానికి ప్రత్యేకదారుల్లేవు. ఉన్నది ఒక్కటే.. నమ్మకం. విశ్వాసం. ఆ విశ్వాసమే సమ్మక్క. ఆ మొక్కే సారలమ్మ. ఇదీ మేడారం. ప్రతి రెండేళ్లకోసారి కీకారణ్యం జనారణ్యంగా మారిపోవడం అనేది ప్రపంచంలో మరెక్కడాలేదు. అదొక్క మేడారానికే సొంతం. ఆదివాసీ ప్రపంచాన్ని ఏకం చేసి కో..అంటే కోటి మందిని కోయజాతి రప్పిస్తున్నది. దట్టమైన అడవిలో దట్టించిన విశ్వాసం. నరంనరం భక్తిభావం ఉప్పొంగింది. చిలుకలగుట్టను సింహాసనంగా చేసుకొని దట్టమైన అడవిని ఆవాసంగా ఎంచుకొని తనజాతిని నిత్యం రహస్యంగా కంటికిరెప్పలా కాపాడుతూ రెండేళ్లకోసారి విశ్వమానవాళిని దీవించేందుకు మేడారం గద్దెలపై కొలువుదీరి నాలుగు రోజులపాటు నలుదిశల్ని ఏకం చేసిన తల్లి సమ్మక్క. బిడ్డ సారలమ్మ. మహిళాణ్విత మా తాస్వరూపం మరోసారి ఈ జాతర జగద్వితమైం ది. 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటి నుంచి నిర్వహించిన జాతరలు ఒకెత్తు అయితే  తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత  నిర్వహించిన జాతరలు ఒకెత్తు. మేడారానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడమే కాదు, ప్రపంచంలోనే ఇటువంటి విశ్వాసాన్ని ప్రకటించే వేదికలేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. స్వరాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ రూపకర్త ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభు త్వం 2016, 2018 జాతరల కంటే 2020 మహాజాతర మరింత ద్విగిణీకృతమైంది. జాతర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ప్రభుత్వ సర్వ వ్యవస్థల్ని తల్లుల సేవకు పురామాయించడమే కాదు జాతర జరుగుతున్న నాలుగు రోజులు సీఎం కేసీఆర్‌ స్వయంగా మంత్రుల్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన చర్యలు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం అన్నది  ఈసారి జాతర విలక్షణత. ప్రత్యేకత. 

అంతర్జాతీయ ఖ్యాతి

మేడారం మహాజాతరకు అంతర్జాతీయ ఖ్యా తి. ఈ ఖ్యాతి రావడానికి మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మలే. అయితే ఆ మహిళాణ్విత శక్తి రోజురోజుకూ విశ్వవ్యాప్తమై బాసిల్లుతుంది. పేదాధనిక అన్న తారతమ్యం లేకుండా మేడారానికి దండంపెట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమైపోయారు. ఇలా మమేకం కావడానికి సమ్మక్కపై మనుషులకు ఉన్న విశ్వాసమే ప్రధానకారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2016లో దేశంలోని ఆదిమ గిరిజన తెగలు అధికంగా ఉండే రాష్ర్టాలకు ‘సమ్మక్కను దర్శించుకోడానికి సాదరంగా రండి’ ఆహ్వానాలు పంపడం అన్న సరికొత్త ఆనవాయితీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకడం మూలంగా 2018 జాతర సందర్భంగా సరిహద్దు రాష్ర్టాల మంత్రులే కాదు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి, రాజ్యసభాధిపతి హోదాలో ఎం వెంకయ్యనాయుడితోపాటు ఛత్తీస్‌గఢ్‌ సీఎం వచ్చారు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ నుంచి నలుగురు మంత్రులు,  ప్రజాప్రతినిధులు రావ డమే కాదు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ ముండా హాజరు కావడం, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ హాజరు కావడమే కా దు ఈశాన్యరాష్ర్టాల నుంచి అనేక మంది భక్తులు, అక్కడి ఎ మ్మెల్యేలు తరలివచ్చి తల్లుల దీవెనలు పొందారు. 

 మేడారానికి రాష్ట్ర కేబినెట్‌..

మేడారం మహాజాతర మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకండా పటిష్టమైన ఏర్పాట్లు ప్రణాళిక బద్ధమైన నిర్వహణ చేసింది. జాతర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం జాతర నిర్వహణలో భాగస్వామ్యమైన శాఖల మంత్రులు సమస్త అధికార యంత్రాంగం మేడారంలో తిష్టవేసి జాతర భక్తులకు సకల సౌకర్యాలను సమకూర్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఈసారి జాతర నిర్వహణలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జాతరకు ముందు, జాతర జరుగుతున్న సమయంలో దాదాపు మేడారంలోనే ఉన్నారా అన్నట్టుగా ఎప్పటికప్పుడు శాఖల మధ్య సమన్వయం చేస్తూ సౌకర్యాలను సమీక్షిస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కడా ఏ చిన్న లోటుపాటు లేకుండా అసాధారణ ఏర్పాట్లు సత్ఫలితాలిచ్చాయి. తత్ఫలితంగా జాతరకు ఈసారి కోటిన్నర భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని పుణితులయ్యారు. ఆర్టీసీ రికార్డు స్థాయి లో రాష్ట్ర నలుమూలల నుంచి 4వేల బస్సు లు, 36వేల ట్రిప్పులతో 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ 4రోజులు జాతరలోనే మకాం వేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మూడు రోజులు మేడారంలోనే ఉండి రాష్ట్ర, జాతీయ ప్రజాప్రతినిధులను స్వాగతించారు. 

ఆఖరి రోజు ఎడతెరిపి లేని మొక్కులు 

మేడారం మహాజాతర ఆఖరి రోజు మునుపెన్నడూ లేని ఏ జాతరలో లేని విధంగా..,దేవతల వన ప్రవేశం చేసే సమయంలోనూ భారీ ఎత్తున జనం మొక్కులు సమర్పించేందుకు బారులు తీ రారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 1-45గంటల వరకు మేడారంలో భారీ వర్షం కు రిసింది. జాతర ప్రాంగణమే కాకుండా క్యూలైన్లు, తల్లుల గద్దెలు తడిసిముద్దయ్యాయి. భక్తులు  వర్షంలోనూ  మొక్కులను సమర్పించుకున్నారు. 

విస్తరిస్తున్న మేడారం 

జాతర ప్రాంగణంలో జనం అంతగా కనిపించకపోవడంతో అందరూ ఈసారి జాతరకు భక్తు లు తక్కువ సంఖ్యంలో వచ్చారా..? అన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలు కే వలం ఊహాజనిత అంచనాలే అని తల్లుల గద్దెలు, క్యూలైన్లలో 4 రోజులపాటు క్షణకాలం పా టు (గవర్నర్లు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మినహా) ఎడతెరపిలేని వానలో, సజీవ జలప్రవాహం వలే భక్తులు  తల్లుల గద్దెల చుట్టూ మోకరిల్లడం విశే షం. ఇంత మందిని ఇక్కడి తరలిరావటానికి తల్లి సమ్మక్క పట్ల, బిడ్డ సారలమ్మ పట్ల గుండెనిండా , మనసు నిండా వెలసిన విశ్వాసమే.. విశ్వాసం మరింత తేజోమయమై విస్తరించాలి. విశ్వసించిన వారి ఎదుగుల విశాల ప్రపంచంలో ఎదురులేకుండా విలసిల్లాలి. అలా విలసిల్లడానికి తల్లుల దీనెన ఉండాలి. మల్లొస్తం సమ్మ క్క. దయ ఉంచు సమ్మక్క అంటూ భక్తకోటి పదేళ్ల పబ్బది పట్టి గుండెనిండా సమ్మక్కను నిలుపుకొని విశ్వాసంతో తిరిగి తమ గూళ్లకు పయనమయ్యారు. 


logo