శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Feb 09, 2020 , 02:36:33

మేడారంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి

మేడారంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసిన నేపథ్యంలో అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జాతరకు సంబంధించి  జిల్లా అ ధికారులతో జాతర తరువాత చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో కొ న్ని అవాంఛనీయ సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిన ట్లు తెలిపారు.  కోట్లాది మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొ క్కులు చెల్లించారని  వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇ బ్బంది కలుగకుండా చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో జాతర విజయవంతమైందన్నారు. జాతర తరువాత చేపట్టే చర్యలు కూడా విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించాలన్నారు.  

అసౌకర్యాలు కలుగకుండా చర్యలు ..

మేడారంలో చేపట్టిన ఏర్పాట్లు జాతర తరువాత కూడా కొనసాగించాలన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో జిల్లా యంత్రాం గం చేపట్టే  చర్యలు స్థానికులకు సంతృప్తికరంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించి శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర తరువాత చేపట్టే చర్యలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

10 నుంచి పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు.. 

ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలని సీఎస్‌ ఆదేశించారు. జాతర పరిసరాల్లో భక్తులు విడిచి వెళ్లిన వ్యర్థాలను  తొలగించి శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా వారం రోజుల పాటు బోరు బావులు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, మోబైల్‌ వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జాతర తదుపరి ఈ నెల 9  నుంచి 20వ తేదీ వరకు మెడికల్‌ క్యాంపులను నిర్వహించి పరిసర ప్రాంతాల్లో   రోగాలు ప్రబలకుండా పటిష్ట  చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 108 వాహనం అందుబాటులో ఉంచాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ జాతర సందర్భంగా అధికారులు చాలా కష్టపడ్డారని, చీఫ్‌ సెక్రటరీ సూచించిన విధంగా జాతర తరువాత అంటు వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల కంటే జాతర తరువాత చేపట్టే చర్యలు ముఖ్యమని, అందుకు ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ కృష్ణ ఆదిత్య, నోడల్‌ అధికారి వీపీ గౌతమ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo