గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Feb 09, 2020 , 02:33:16

జాతీయ హోదాకు కృషి చేస్తా

 జాతీయ హోదాకు కృషి చేస్తా

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: మేడారం జాతరకు జాతీయ హోదా లభించేలా కృషి చేస్తానని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ముండా హామీ ఇచ్చారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర చివరి రోజు శనివారం ఆయన తల్లులను దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్‌కు, అధికార యంత్రాంగానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడంతో తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందని కేంద్ర మంత్రి కొనియాడారు.  

జాతీయ హోదా సాకరమవుతుంది..

ఆదివాసీల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని, మేడారం జాతరకు త్వరలోనే జాతీయ హోదా వస్తుందని అర్జున్‌ముండా విశ్వాసం వ్యక్తం చేశారు. సమ్మక్క, సారలమ్మ దీవెనలు ప్రజలందరికీ ఉండాలని తల్లులకు మొక్కులు చెల్లించానని ఆయన పేర్కొన్నారు.

అర్జున్‌ముండాకు మంత్రి అల్లోల వినతి

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి అర్జున్‌ముండాను కోరినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లలో ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, తదితరులు పాల్గొన్నారు.


logo