గురువారం 04 జూన్ 2020
Mulugu - Feb 08, 2020 , 03:26:01

జనగంగలా మేడారం జంగలి

జనగంగలా మేడారం జంగలి

ప్రపంచం.. మేడారం వైపు చూస్తోంది. వనదేవతలు కొలువైన మేడారం జనగంగను తలపించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పల్లె.. మహానగరంగా మారింది. మహాజాతరకు తరలివచ్చిన భక్తులు దారుల్లో చీమలబారులై కదిలారు. రెండేళ్లకోసారి వనం నుంచి జనం కోసం వచ్చిన తల్లులను కనులారా చూసిన భక్తులు పులకించారు.  కోటిన్నర మంది భక్తులకు ఆతిథ్యం ఇచ్చిన వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో మేడారంలోని కొండ, కోన, పరవశించింది. శివసత్తుల పూనకాలు, అదివాసీ  విన్యాసాలు, సంపెంగ స్నానాలతో తల్లులు కొలువైన మేడారం భక్తితో ఊగిపోయింది.  రెండేళ్ల  తల్లుల జాప్ఞకాలతో మూటకట్టుకుని వచ్చిన భక్తులకు మేడారం గద్దెలపై నుంచి తల్లులు దీవెనలు అందించారు. మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి తల్లుల సేవలో తరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివాసీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే జాతరకు మధ్య భారతం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

భక్తులకు తల్లుల దీవెనలు

వనం నుంచి జనంలోకి వచ్చిన వన దేవతలు భక్త జనులకు దీవెనలు అందజేస్తున్నది. వనదేవతల దర్శనం కోసం భక్తులు సుదూరప్రాంతాల నుంచి మేడారానికి తరలివచ్చారు. రెండు రోజుల పాటు తల్లీబిడ్డలు గద్దెలపై భక్తకోటికి దీవెనలు అందజేశారు. తల్లులకు దర్శించుకుంటేనే జన్మ ధన్యమవుతుందన్న నమ్మకంతో కోట్లాది మంది  తరలివచ్చారు.  భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయని తల్లులు కోరిన ప్రగాఢ  విశ్వాసం.

గద్దెలపై తల్లులను చూసి తరించిన భక్త జనం

రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత గద్దెలపై కొలువుదీరిన తల్లీబిడ్డలు సమ్మక్క-సారలమ్మను చూసిన భక్త జనం తన్మయత్వంతో తరించారు. తల్లుల దర్శనం చేసుకున్న భక్తులు.. జన్మధన్యమైందన్న భక్తి భావంతో పరవశించిపోయారు. భక్తి, ముక్తి అంతా జంపన్న వాగులోనే అన్న భావనతో జాతరకు వచ్చి తొలి స్నానం చేశారు. తలనీలాలు ఇచ్చి వనదేవతలకు ఇష్టమైన బంగారం (బెల్లం) నెత్తిన పెట్టుకొని మొక్కు సమర్పించారు. ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడేలా డోలు వాయిద్యాలు మధ్య  విచిత్ర వేషదారణలతో తల్లుల దర్శనానికి వెళ్లారు. 

మహా జాతర పరిపూర్ణం

నాలుగు రోజుల మహాజాతర తల్లుల రాకతో పరిపూర్ణమైంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దెలపై కొలువుదీరారు. తల్లీబిడ్డలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు.  రెండేళ్లకోసారి గద్దెలపైకి వచ్చే తల్లులు రెండు రోజుల పాటు కోట్లాది భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రెండు రోజులు భక్తుల కోసం వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క- సారలమ్మ శనివారం  సాయంత్రం మళ్లీ వనప్రవేశం చేయనుంది. దీంతో నాలుగు రోజుల మహా జాతర పరిపూర్ణం కానుంది.


logo