గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Feb 07, 2020 , 03:29:56

వరాల తల్లి గట్టమ్మ..

వరాల తల్లి గట్టమ్మ..

ములుగురూరల్‌, ఫిబ్రవరి06: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.  ప్రతి రెండు సంవత్సరాలు ఒక సారి జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన మేడారం జాతర సమయంలో జిల్లా  కేంద్రం జాకారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆదిదేవత గట్టమ్మ దేవాలయాన్ని లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు.  జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మ తల్లికి మొక్కు చెల్లించిన అనంతరమే మేడారం వెళ్తారు. పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు నేటికి పాటిస్తూ గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తున్నారు. జాతర సమయంలో మేడారం వెళ్లే కోటికి పైగా భక్తజనం ఈ గట్టమ్మ తల్లితో పాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఉన్న మరో 7గట్టమ్మ తల్లులను దర్శించుంటారు. ఇందులో ఎక్కువగా భక్తుల నుంచి పూజలు అందుకునే అమ్మవారు ములుగు జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న గట్టమ్మ. జాతీయ రహదారి 163కి అనుకుని ఉన్న దేవాలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని ఆదిదేవత గట్టమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇతర సమయాల్లో కూడా ప్రయాణికులు గట్టమ్మ దేవాలయం వద్ద ఆగి ఆదిదేవతకు మొక్కు చెల్లించిన అనంతరమే ముందుకు సాగుతారు.    వరాల తల్లిగా పేరున్న  ఈ  అమ్మవారు నిత్యం  భక్తుల నుంచి పూజలు అందుకుంటూ వారికి అండగా నిలుస్తోంది. 


నాయకపోడుల ఆచార, సంప్రదాయాలకు ప్రతిరూపం ఆదిదేవత..

గట్టమ్మ దేవాలయానికి పూర్వ నుంచి నాయకపోడులే పూజారులు. వారి ఆచార సంప్రదాయాలకు గట్టమ్మ తల్లి ప్రతిరూపం. గట్టమ్మ తల్లిని నాయకపోడులు ఎంతో  భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మేడారం జాతర సమయంలో గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగను  నిర్వహించి జాతరకు తరలివచ్చే కోటిన్నర భక్తులకు ఎలాంటి ఆపద కలుగకుండా పూజలు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి కూడా తనను దర్శించుకునే భక్తులకు తోడుగా ఉంటుందని నమ్మకం. గట్టమ్మ తల్లి విగ్రహం సుమారు 55 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రం పరిధిలోని కొండ దిగువ భాగంలో చేన్లలో ఉండేది. పూర్వం ఎడ్ల బండ్ల దారుల్లో ఉన్న దిగువ గుట్ట నుంచి గట్టమ్మ తల్లిని  జాతీయ రహదారి పక్కకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ములుగు వాస్తవ్యుడు,  నాయకపోడ్‌  కుల పెద్ద మనిషి ఆకుల నర్సయ్య ప్రస్తుతం దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 


గట్టమ్మ పూర్వ చరిత్ర.. 

 కాకతీయుల పాలనలో సైనిక ముఖ్యులుగా నాయకులుగా పనిచేసిన వాళ్లే నాయకపువాళ్లు, నాయకపోళ్లు, నాయకపోడు గిరిజనులు. కాకతీయుల పాలనలో ప్రజలు భైరవ, మైలారులను పూజించే వారు. కాకతీయుల పాలనలో పూజింపబడి  బైరవుడే నేటి నాయకపోడు గిరిజనులతో పూజలందుకుంటున్న పోతురాజు. ముఖ తోడుగు ప్రతిరూపం, స్త్రీ శక్తి స్వరూపమైన(మైలారు) కాకతీయుల పూజలందుకున్న కాకితమ్మనే కాకతి దర్గమ్మ. నాయక రాజ్యంలోని నాయంకర దుర్గాలకు నాయకత్వం వహించిన నాయకపు వాళ్లు దుర్గమ్మను కొలవడంలో వారికి పూర్వ చరిత్రతో సంబంధం ఉంది. ఖమ్మం జిల్లాలో పులిపై ఆసీనురాలైన పెద్దమ్మను కొలుస్తారు. ములుగులోని గట్టమ్మ రూపం, రాచకొండ గుట్టల్లో పద్మనాయక రాజుల కాలంలో పూజింపబడిన సరళ మైసమ్మ రూపం ఒకే విధంగా ఉంటుంది. నేటికీ నాయకపోడులు ప్రతి ఇంటిలో దుర్గమ్మను కొలుస్తారు. ఇండ్లలో ఉండే దుర్గమ్మ రూపం కుండలో పసుపు, కుంకుమలు, గాజులు, కొత్త దుస్తులు సమర్పించి పెళ్లిళ్లు, పండుగల  సందర్భాలలో ఇలవేల్పుగా కొలవడం నాయకపు తెగ  ఆనవాయితీ. నాయకరాజ్య కోట దుర్గాల ఎదుట, అరణ్య వాసంలో పాండవులు నివసించే కొండ గుహల ఎదుట మైసమ్మను కొలుస్తారు. గుట్టలు, గట్టు అడవిలోని జీవరాసులన్నీ గట్టమ్మ ఆధీనంలో, గట్టు ముసలమ్మ కనుసన్నల్లో, వృక్షాలు, అటవీ సంపద దైవ ఎర్రమ్మ , ఎర్రమారి ఆధీనంలో ఉంటాయని ఆదిమ తెగల విశ్వాసం. 


రెండు జిల్లాల పరిధిలో గట్టమ్మ తల్లికి ఏడుగురు అక్కాచెల్లులు.. 

నాయకపోడుల దైవాలైన గట్టమ్మ తల్లులు ములుగు, భూపాలపల్లి  జిల్లాలోని ఏడుగురు అక్కచెల్లెల్లుగా కొలువుదీరారు. ములుగు గట్టమ్మతో సహా ఏడుగురు అక్క చెల్లులు ఈ రెండు జిల్లాలో కొలువై భక్తులతో పూజలు అందుకుంటున్నారు.


నిండు జాతరలో భక్తులను గట్టమ్మ కాపాడుతుంది 

-కూన శివరాం, గట్టమ్మ దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, ములుగు 

మేడారం సమ్మక్క-సారలమ్మ ల నిండు జాతరకు తరలివచ్చే భక్తులను గట్టమ్మ తల్లి కాపాడుతుంది. భక్తులకు ఎలాంటి ఆపద రానియకుండా చూసుకుంటుంది. గట్టమ్మ వారాలిచ్చే తల్లి కావడంతో  మేడారం జాతర సమయంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.  


logo