మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 07, 2020 , 03:28:59

దండంపెట్టిన దండకారణ్యం

దండంపెట్టిన దండకారణ్యం

ఆదివాసీ సమ్మేళనం.. దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తజనం .. మధ్య భారతం  కదిలొచ్చింది.. మేడారానికి దండకారణ్యం దండంపెట్టింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన ఆదివాసీ గిరిజన జాతి సంస్కృతి మేడారంతో మమేకమైంది. జంపన్నవాగు పొడవునా చెలిమె తొక్కుడు ఆటలతో కోయజాతి ఎగిరి గంతేసింది. చిలుకలగుట్ట పాదాల చెంత పారాడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ప్రఖ్యాతి చెందిన మేడారం మహాజాతరకు కాలక్రమేణా గిరిజనేతరుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గిరిజనేతరులు ఎంత పెరిగినా, మేడారం చుట్టుపక్కల అనేక ఆదివాసీగూడేల వరకు పరివ్యాప్తమైనా జాతర సమస్తం కోయ గిరిజన ఆచార సంప్రదాయాలతో మమేకం కావలసిందే. భక్తజన గుడారంగా ప్రతి రెండేళ్లకోసారి విరాజిల్లే మేడారం మహాజాతరకు ఈ సారి అనూహ్య ఏర్పాట్లు, విస్తృత సౌకర్యాలు కల్పిస్తూ దేశ నలుమూలలా జరిగిన ప్రచారంతో ఇతర రాష్ర్టాల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  మారుమూల పల్లెలు, గిరిజన గూడేల నుంచేగాక పట్టణాలు, నగరాల నుంచి లక్షలాదిగా తరలివస్తుండడంతో కీకారణ్యంలోని మేడారం పరిసరాలు జనారణ్యంగా మారాయి. రాష్ట్ర నలుమూలల నుంచేగాక దేశంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదివాసీ ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని తన్మయత్వం చెం దుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలతోపాటు ఎడ్లబండ్లలోనూ వస్తుండడంతో మేడారం జన గుడారంగా మారింది. మహాజాతర ఘట్టం బుధవారం ప్రారంభం కావడంతో తల్లు లు సమ్మక్క-సారలమ్మలకు  మొక్కులు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు.


లక్షలాదిగా గిరిజనులు.. 

మేడారం జాతరకు రాష్ట్రంలోని ఆదివాసీలేగాక పొరుగు రాష్ట్రాల నుంచి వివిధ తెగలకు చెందిన గిరిజనులు లక్షలాదిగా తరలివచ్చారు. మహాఘట్టం ప్రారంభానికి ముందే వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కోయ, కొండరెడ్లు, వడ్డెలతోపాటు మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గోండులు, వివిధ కోయతెగలకు చెందిన గిరిజనులు తరలివచ్చారు. బుధవారం సారలమ్మ గద్దెపైకి చేరుకునేందుకు ముందే ఆయా రాష్ట్రాల నుంచి లక్షలాదిగా గిరిజనులు మేడారానికి వచ్చారు. వీరిలో అత్యధికులు ఎడ్లబండ్లపై రావడంతో జాతర ప్రదేశం భక్తులతో రద్దీగా మారింది. గిరిజనుల ఇష్టదైవాలైన సమ్మక్క, సారలమ్మలను వీరు మాతాజీలుగా పిలుచుకుంటారు. పసుపు, కుంకుమతోపాటు ఒడిబియ్యం తల్లులకు సమర్పిస్తారు. డోలు, వాయిద్యాలతో ఆట, పాటలతో కుటుంబ సమేతంగా వచ్చిన వీరు మేడారం పరిసరాల్లో ఒదిగిపోయారు.


జనదేవతల వన ప్రవేశం వరకూ..

ఆదివాసీల ఆరాధ్యదైవాలైన సమ్మ క్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న నాలుగు రోజులపాటు భక్తుల మొక్కులు స్వీకరించిన అనంతరం చివరిరోజు వనప్రవేశం చేసే వరకూ గిరిజనులు మేడారంలోనే ఉంటారు. ఆయా రాష్ర్టాల నుంచి వచ్చిన ఆదివాసీ తెగలతో పాటు ఇతర భక్తులు సైతం జాతర పూర్తయ్యే వరకూ మేడారంలోనే కుటుంబ సభ్యులతో గడుపుతారు. కన్నెపల్లి, మేడారంలోని చిలుకలగుట్ట ప్రాంతాలతో కలియతిరుగుతూ అమ్మవార్ల సేవలో పునీతులవుతారు.


మూటాముల్లెలతో..

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూటాముల్లెలతో మేడారంలో విడిది చేశారు. ఇక్కడి అట వీ ప్రాంతంలోని చెట్లు, మైదాన ప్రాం తంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తాగునీరు, ఇతర వసతులను కల్పించడంతో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అమ్మవార్లు వనప్రవేశం చేసే వరకూ ఇక్కడే ఉండి తీపి జ్ఞాపకాలతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.                                                                           

- సీహెచ్‌ సోమనర్సయ్య, మేడారం


logo