శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Feb 06, 2020 , 03:38:03

తల్లుల గద్దెల వద్ద పటిష్ట భద్రత

తల్లుల గద్దెల వద్ద పటిష్ట భద్రత
  • జాతరపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ
  • డాగ్‌ స్కాడ్‌తో విస్తృత తనిఖీలు

మేడారం బృందం, నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. దాదాపు కోటి మందికి పైగా భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి, వన దేవతలను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతో జాతరపై జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం వన దేవతలను  దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల తాకిడిని మంచెపై నుంచి ఎస్పీ పర్యవేక్షించారు. అంతే కాకుండా గద్దెల ప్రాంగణంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ఇతర వీఐపీలు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశాలుండడంతో డాగ్‌ స్కాడ్‌ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా బందో బస్తును పరిశీలిస్తున్నారు. 


నాలుగు డంపింగ్‌యార్డులు ..

మహాజాతరలో నిత్యం సేకరిస్తున్న వ్యర్థాలను తరలించేందుకు నాలుగు డంపింగ్‌ యార్డులను, 300 మి నీ డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేశారు. కోటిన్నరకు పైగా తరలివచ్చే భక్తులకు జాతర సమయంలో దుర్గం ధం వెదజల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.


 54 మంది రెస్క్యూ టీం సభ్యులు..

సింగరేణికి చెందిన 54 మంది రెస్క్యూ టీం సభ్యులు మేడారం జాతరలో తమ సేవల ను అందించేందుకు తరలివచ్చారు. 18 మంది ఆర్టీసీ బస్టాండు వద్ద, 36 మంది గద్దెల తమ సేవలు అందిస్తున్నారు.


15 మంది ఈతగాళ్లు 

జంపన్న వాగు వద్ద సింగరేణికి చెందిన 15 మంది గజ ఈతగాళ్లు విధులు నిర్వహి స్తున్నారు. వీరితో పాటు 20 మంది స్కౌట్స్‌ వలంటీర్లు, 75 నీటి ట్యాంకర్లను వినియోగి స్తున్నారు. 


logo