ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:59:45

జన మేడారం...

జన మేడారం...
  • భారీగా తరలివస్తున్న భక్తులు
  • తల్లుల రాక కోసం ఎదురుచూపులు
  • పోలీసుల భారీ బందోబస్తు

మేడారం నమస్తే తెలంగాణ బృందం: ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతరకు ఘడియలు సమీపించాయి. వనదేవతల ఆగమన సమయం దగ్గర పడుతున్న కొద్ది మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎటుచూసినా గుడారాలు వెలుస్తున్నాయి. సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకొని తరించాలని దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో అనుభవజ్ఞులైన అధికారగణాన్ని నియమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నది. 


కీకారణ్యంలో వెలుస్తున్న గుడారాలు

భక్తులు సేద తీరడానికి ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు వేసుకుంటూ మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా తల్లుల సన్నిధిలో గడిపేందుకు మేడారం బాట పట్టారు. మేడలు, మిద్దెలులేని మేడారంలో చుట్టూ సుమారు 15 కిలిమీటర్ల మేర విస్తృతంగా గుడారాలు వెలిశాయి. పిల్లాపాపలతో తల్లుల దర్శన భాగ్యం కోసం ఎదరుచూస్తున్నారు. 


పోలీసుల భారీ భద్రత 

మేడారానికి చేరుకుంటున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా పో లీసు యంత్రాంగం పదివేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నది. నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌, వరంగల్‌ సీపీ, మేడారం ట్రాఫిక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, రామగుండం సీపీ సత్యనారాయణ, ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రాంసింగ్‌జీ పాటిల్‌ నేతృత్వంలో నలుగురు డీసీపీలు, 29 మంది ఏ సీపీలు, 100 మంది డీఎస్పీలు, 240 మంది సీఐలు, 770 మంది ఎస్సైలతోపాటు 8857 మంది పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు రాత్రింబవళ్లు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. 


logo