శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Feb 05, 2020 , 03:57:43

కాంగ్రెస్‌ దుకాణం ఇక ఖాళే

కాంగ్రెస్‌ దుకాణం ఇక ఖాళే

కాళేశ్వరం, ఫిబ్రవరి 04 : మంథని నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్‌ దుకాణం మూతపడినట్లేననీ, ప్రజలు ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్నారనీ, ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడమే ఇందుకు కారణమని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిణి అన్నారు. ఈ మేరకు మహదేవపూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చల్లా తిరుపతయ్య, మహదేవపూర్‌-3 ఎంపీటీసీ చల్లా రమతోపాటు వంద మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంథని మండల కేంద్రంలోని పుట్ట మధు నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గొప్ప మనసుతో మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.  ఏ ఒక్కరూ ఆపదలో ఉన్నా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇది గమనించి  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలస వస్తున్నారని అనారు. 


మంథని నియోజక వర్గం అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టడం వల్లనే పొరబాటున కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారనీ, ఇప్పుడు వాస్తవాలను గ్రహించి తమ తప్పు తెలుసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిస్తున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న నాయకులు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, సీఎం కేసీఆర్‌ మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు జక్కు రాకేశ్‌, నారాయణరెడ్డి, మహదేవపూర్‌ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌, మహదేవపుర్‌ సర్పంచ్‌ శ్రీపాతిబాపు, నాయకలు మెంగాని అశోక్‌, మధుసూదన్‌, నాగరాజు వివిధ గ్రామాల ప్రజలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. logo