మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Feb 04, 2020 , 03:45:21

మోగిన సహకార నగారా..

మోగిన సహకార నగారా..

ములుగు, నమస్తేతెలంగాణ: జిల్లాలో సహకార ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి సోమవారం జిల్లా సహకార శాఖ అధికారి నాగనారాయణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు 2018 సంవత్సరానికి ముందు పీఏసీఎస్‌లలో రుణాలు తీసుకుని చెల్లించని వారిని డిఫాల్టర్లుగా గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించారు. తుది జాబితాను తయారు రూపొందించి వార్డుల వారీగా రిజర్వేషన్లను  ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 పీఏసీఎస్‌లలో 23,039 ఓటర్లను గుర్తించారు. వీరికి  ఈ నెల 15న జరగనున్న సహకార ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించి బ్యాలెట్‌ పద్ధతిన పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు  స్వీకరించి 9న నామినేషన్లను  స్క్రూటీని చేసి 10వ తేదీన నామినేషన్ల  ఉప సంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి మధ్యాహ్నం విజేతలను ప్రకటించనున్నారు. జిల్లాలోని ములుగు, వెంకటాపూర్‌, నర్సాపూర్‌, పాలంపేట, లక్ష్మీదేవిపేట, ఇంచర్ల, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపూర్‌(నూగూరు) పీఏసీఎస్‌లకు ఎన్నికల అధికారులు, అసిస్టెంట్‌ అధికారులను సోమవారం డీసీవో నియమించారు. అన్ని పీఏసీఎస్‌లలో 13మంది డైరెక్టర్లకు గాను రిజర్వేషన్ల  ప్రకారం ఖరారు చేశారు. ములుగు పీఏసీఎస్‌లో అత్యధికంగా 4,839మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా మంగపేటలో 2493మంది, వెంకటాపూర్‌లో 2590, నర్సాపూర్‌లో 1383, వెంకటాపురం(నూగూరు)లో 1581, వాజేడులో 778, ఏటూరునాగారంలో 1892, తాడ్వాయిలో 2138, గోవిందరావుపేటలో 2236, లక్ష్మీదేవిపేటలో 1520, పాలంపేటలో 856, అత్యల్పంగా ఇంచర్ల పీఏసీఎస్‌లో 733మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సహకార ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా 156మంది డైరెక్టర్లు పోటీ చేయనుండగా దానికి సంబంధించిన రిజర్వేషన్లను  ప్రకటించారు. ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో పీఏసీఎస్‌లో 13మంది డైరెక్టర్లకు అవకాశం కల్పించారు. చైర్మన్‌ , వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కావడానికి రిజర్వేషన్లు  ప్రకటించలేదు. గెలిచిన 13మంది సభ్యులలో మెజార్టీ సభ్యులు బలపర్చిన డైరెక్టర్లు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నుకునే అవకాశం  కల్పించారు. 


logo