శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Feb 04, 2020 , 03:44:33

నేడు మేడారానికి పగిడిద్దరాజు

నేడు మేడారానికి పగిడిద్దరాజు

కొత్తగూడ, ఫిబ్రవరి 3: గిరిజనుల ఆరాధ్య దైవ్యం, స మ్మక్క భర్త పగిడిద్దరాజు గంగారం మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం మేడారానికి తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు గిరిజన పూజారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క- సారక్కల మహాజాతర పగిడిద్దరాజు వెళ్లాకే ప్రారంభం కానున్నది. పూనుగొండ్లలోని గుట్టపై పగిడిద్దరాజు గుడిని నాల్గొవ గొట్టు గోత్రం కలిగిన వారు మంగళవారం తెల్లవారుజామున శుద్ధి చేసి, ముగ్గులు వేస్తారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజుకు గ్రామంలోని పెద్దలు, వడ్డెలు కలిసి వారి సంప్రదాయల మధ్య పూజలు నిర్వహిస్తారు. పెనక వంశీయులు, కల్తీ వంశీయులు, వడ్డెలు పగిడిద్దరాజును చేతబూని కాలినడకన పూనుగొండ్లలో ఊరేగింపుగా బయల్దేరి అటవీమార్గాన కాలినడకన గోవిందరావుపేట మండలం కర్లపల్లికి చేరుకుంటారు. ఆ గ్రామంలోని పెనక వంశీయుల ఇంటిలో పగిడిద్దరాజు(పడిగె)తో పూజారులు, పెనక వంశీయులు, గ్రామస్తులు ఆ రాత్రి నిద్ర చేస్తారు. బుధవారం తెల్లవారుజామున మేడారానికి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క పూజారులు, పగిడిద్దరాజు పూజారులు ఎదుర్కోలు నిర్వహిస్తారు. తదనానంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం వేటకు వెళ్లినప్పుడు అలిసిపోయిన గిరిజనులకు ఓ బండారి వృక్షం కింద బంగారు ఉంగరం కనిపించింది. ఆ ఉంగరాన్ని గ్రామంలోకి తీసుకొచ్చిన తర్వాత ‘పగిడిద్దరాజును వెలిశాను’ అంటూ ఓ వ్యక్తి పూనకంతో చెప్పాడు. “నన్ను నాల్గొవ గొట్టు వంశీయులైన వారు పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తా”నంటూ పగిడిద్దరాజు చెప్పారని గిరిజనుల నమ్మకం. అప్పటి నుంచి ఆయనను కొలుస్తున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క గద్దె వద్దకు తీసుకొని వెళ్లి పూజలు చేస్తున్నారు. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున వివాహం జరిపిస్తారు. కాగా, మూడురోజుల జాతర అనంతరం వారు పూనుగొండ్లకు తిరిగి ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 12, 13,14 తేదీల్లో పూనుగొండ్లలో మరువెళ్లి జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పగిడిద్దరాజును మేడారం తరలించేందుకు గిరిజనులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది మరిన్ని సౌకర్యాలు కల్పించిందని గ్రామస్తులు చెప్పారు. గ్రామం నుంచి పగిడిద్దరాజు గుట్టకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు ప్రధాన పూజారులు పెనక మురళీధర్‌, సురేందర్‌, సమ్మయ్య, బుచ్చిరాములు, శివసత్తులు భిక్షపతి, సమ్మ య్య, ఎర్రయ్య తెలిపారు. 


logo