సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Feb 04, 2020 , 03:42:08

ట్రాఫిక్‌పై దృష్టి సారించాలి

ట్రాఫిక్‌పై దృష్టి సారించాలి

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: మేడారం జాతరలో విధులు నిర్వహించే పోలీసులు ట్రాఫిక్‌ సమ స్యలపై దృష్టి కేంద్రీకరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌, మేడారం జాతర ట్రాఫిక్‌ జోన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ వీ రవీందర్‌ ఆదేశించారు. గోవిందరావుపేట మండలం పస్రా పోలీస్‌ స్టేషన్‌లో కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలపకుండా చూడాలన్నారు. వాహనాలను పార్కింగ్‌ ప్రాంతాల్లోనే ఆపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్‌ జామ్‌ అయితే తక్షణమే స్పందించి వాహనాలను పార్కింగ్‌ ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ చొరవతో గట్టమ్మ గుట్ట వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. వాహనాలను రోడ్డుపై పార్కింగ్‌ చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాల్లో నిలిపేలా చర్యలు చేపట్టామన్నారు. వరంగల్‌, కరీంనగర్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే వాహనాలకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో క్రమ పద్ధతిలో పార్కింగ్‌ చేసేలా చూడాలని ఆదేశించారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో సరైన లైటింగ్‌ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. మేడారానికి వచ్చే మార్గాల్లో వాహనాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సెక్టార్‌ ఇన్‌చార్జిలు ఎలాంటి చర్యలు చేపట్టాలో కమిషనర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ముఖ్యంగా మేడారం ప్రైవేటు ఆర్టీసీ బస్సులు, వచ్చిపోయే మార్గాలపై పూర్తి అవగాహన కల్పించారు. సిబ్బందికి మౌళిక వసతులు కల్పించాలన్నారు. ఖమ్మం కమిషనర్‌ తౌశిక్‌ ఎక్బాల్‌, ములుగు, మహబూబాబాద్‌  ఎస్పీలు డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, కోటిరెడ్డి జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo