గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Feb 04, 2020 , 03:41:19

మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి

మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి

ములుగు జిల్లా ప్రతినిధి/ నమసే ్తతెలంగాణ:  తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం శ్రద్ధ వహించిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వెల్లడించారు. ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, జాతర నోడల్‌ ఆఫీసర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం జాతర అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించే సౌకర్యాల కోసం రూ.75 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. జాతర కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులతో శాశ్వత, తా త్కాలిక ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు వివరించారు. చిన్న చిన్న పనులు పూర్తి కావచ్చాయని చెప్పారు. 

నాణ్యతకు ప్రాధాన్యత 

జాతరలో చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలకు లోబడి పూర్తి చేశామని, నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. చేపట్టిన పనుల్లో జిల్లా యంత్రాంగం నాణ్యత, పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందని, తద్వారా పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా చేపట్టినట్లు వెల్లడించారు. రూ. 8.5కోట్లతో రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తయాయ్యాయని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చెక్‌పాయింట్‌లు ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థ సజావుగా  కొనసాగేలా పోలీస్‌ యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్‌ స్థలాలను గుర్తించి అభివృద్ధి చేశామని వెల్లడించారు. 

డంపింగ్‌యార్డుల ఏర్పాటు

జాతరకు కోటిన్నరకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా జాతరలో 3450 మంది పారిశుధ్య కార్మికులతో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు. జాతర పరిసరాల్లో 4 అతిపెద్ద డంపింగ్‌యార్డులను, 300 మినీ డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. తాగునీరు, రవాణా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. భక్తుల రవాణా కోసం టీఎస్‌ ఆర్టీసీ ద్వారా 4వేల బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారంలో 40 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 41 టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, లైటింగ్‌, రెయిలింగ్‌ తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు అసౌకర్యం కలుగకుండా చూశామన్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు అనువుగా జాతర పరిసరాల్లో తాడ్వాయి, కామారం, చిన్నబోయినపల్లి ప్రాంతాల్లో అత్యవసర పార్కింగ్‌ స్థలాలను రూ. 2.48 కోట్ల నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, 10 అగ్నిమాపక వాహనాలు, 2 మిస్టు జీపులు, 20 మిస్టు బుల్లెట్‌ వాహనాలు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. 

300 మంది గజ ఈతగాళ్లు 

జంపన్నవాగులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 300 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా రూ.19 కోట్లతో జంపన్నవాగు వద్ద 538 బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌, 44 ఇన్‌ఫిల్టరేషన్‌ వెల్స్‌ చేపట్టామని, 8400 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటి కోసం 3 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతర పర్యవేక్షణకు 38 సెక్టార్లుగా విభజించామని, ప్రధాన ప్రాంతాలను 38 సెక్టార్లకు అనుసంధానం చేసి 700 మంది అధికారులను సెక్టార్‌కు 3 షిఫ్టులలో విధులు నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. 

10వేల మందితో భద్రత

మేడారం జాతరకు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రాంసింగ్‌ జీ పాటిల్‌ తెలిపారు. ఆలయ ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్నవాగు ప్రాంతంలో 3 ప్రధాన పోలీస్‌ క్యాంపులతో పాటు 23 మినీ పోలీస్‌ క్యాంపులను ఏర్పాటు చేసి 10వేల మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. 300 సీసీ కెమెరాలు, 3 డ్రోన్‌ కెమెరాలతో  జాతర పరిసర ప్రాంతాలు, 29 పార్కింగ్‌ స్థలాలను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. మేడారం కల్యాణ మండపంలో రూ.1.46 కోట్లతో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. మేడారం పరిసర  గ్రామాల్లో ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని, ఇందు కోసం 170మంది మెడికల్‌ ఆఫీసర్లు, 560మంది పారామెడికల్‌ సిబ్బంది, 150మంది ఆశ వర్కర్లకు విధులు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డీఎస్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo