శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Feb 03, 2020 , 03:09:36

21 శాఖలతో సమన్వయం

21 శాఖలతో సమన్వయం
  • పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
  • ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు
  • 100 శాతం ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు
  • 30 స్వచ్ఛ ఆటోలు..10 హరిత ఫుడ్‌కోర్టులు
  • రూ. కోటితో 5 పిలిగ్రిమ్‌ షెడ్లు
  • రూ. 2 కోట్లతో సోలార్‌ విద్యుత్‌ లైట్లుములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : 21విభాగాల సమన్వయంతో జాతరను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు  ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు తెలిపారు. జాతర నిర్వహణకు చేపట్టిన అభివృద్ధి పనులు, విధివిధానాలపై  ఆయన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు మాట్లాడారు. “జాతర నిర్వహణకు గత సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ఏర్పాట్లకు సంబంధించి తగిన ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతర నిర్వహణకు రూ.75కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రూ.38కోట్లతో సివిల్‌ పనులు, రూ.36కోట్లతో నాన్‌ సివిల్‌ పనులు చేపట్టి 21 విభాగాలను సమన్వయం చేస్తూ జాతర నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నాం” అని చక్రధర్‌రావు తెలిపారు. 


పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..

మహా జాతరకు వచ్చే కోటిన్నర భక్తులకు పారిశుధ్య సమస్యలు కనిపించకుండా ప్రత్యేక దృష్టి కేటాయించినట్లు పీవో చక్రధర్‌రావు తెలిపారు. జాతరలో భక్తుల కోసం 8400టాయిలెట్ల నిర్మా ణం చేపట్టినట్లు తెలిపారు. వాటి నిర్వహణకు 1000మంది కార్మికులను నియమించామన్నా రు. జాతరకు వచ్చే భక్తులకు జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో 3500మంది పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌, హైదరాబాద్‌ల నుంచి 500మంది సుశిక్షితులైన కార్మికులను రప్పించినట్లు తెలిపారు. 30స్వచ్ఛ ఆటోలను చెత్త సేకరణకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతరలో సేకరించిన చెత్తా చెదారాన్ని తరలించేందుకు 4 డంపింగ్‌యార్డులను, 300 మినీ డంపింగ్‌ యా ర్డులను ఏర్పాటు చేశామని పీవో వివరించారు.


ఐటీడీఏ నిధులతో సోలార్‌ లైట్లు..

మేడారం జాతర సందర్భంగా మేడారంతోపాటు మేడారం పరిసర గ్రామ పంచాయతీల్లో రూ.2కోట్లతో 249 సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశామని పీవో చక్రధర్‌రావు తెలిపారు. రూ.కోటితో భక్తుల సౌకర్యార్థం 5ఫిలిగ్రీమ్‌ షెడ్‌లను నిర్మించి వినియోగంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతీ పిలిగ్రీమ్‌ షెడ్‌లో 1000మంది భక్తులు సేద తీరే విధంగా అన్ని వసతులతోపాటు టాయిలెట్లు, భక్తులకు వంటలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.


10 హరిత ఫుడ్‌ కోర్టులు..

జాతరకు వచ్చే భక్తులకు సుచిరుచికరమైన వంటకాలను అందించేందుకు 10 హరిత ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఐటీడీవో పీలో తెలిపారు. భక్తులకు మేడారంలో తగు వసతులతో కూడిన హరితహోటల్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మేడారంలో జీసీ సీ, విజయ డైరీల ద్వారా భక్తులకు తినుబండారాలను అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 

వైద్య ఆరోగ్య సేవలు..

జాతరకు వచ్చే భక్తులకు అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవించినప్పుడు వారిని క్షేమంగా రక్షించేందుకుగాను 108వాహనాలతోపాటు పది 108 ద్విచక్ర వాహనాలను సత్వర వైద్య సేవల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని పీవో చక్రధర్‌రావు తెలిపారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం 16ప్రత్యేక వైద్య శిబిరాలను, 108వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఏటూరునాగారం, ములుగు కేంద్రాల్లోని వైద్యశాలలో వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.


ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా..

మేడారం జాతర ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలకు నిలయమని పీవో తెలిపారు. మేడారం జాతర సందర్భంగా జాతరలో ఆదివాసీ  సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నాయకపో డు, గుస్సాడీ, దీన్సా, కోయ కళాకారులతో హంపి థియేటర్‌లో 100మంది కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మేడారంలోని ఆదివాసీ మ్యూజియంను ఆధునీకరించడంతోపాటు మ్యూజియంను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.


ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరకు చర్యలు..

మేడారం జాతరను ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరగా నిర్వహించేందుకు 90శాతం చర్యలు తీసుకున్నామని పీవో చక్రధర్‌రావు తెలిపారు. భక్తులు కూడా మేడారానికి ప్లాస్టిక్‌ను తీసుకురావడం తగ్గించినటుల ఆయన తెలిపారు.  ప్రధానంగా ఆర్టీసీ వారి సహకారంతో ప్లాస్టిక్‌ నివారణ ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టినట్లు పీవో పేర్కొన్నారు.  భక్తులు బస్సు ఎక్కే క్రమంలో ప్లాస్టిక్‌ లేకుండా తనిఖీలు చేపడుతున్నామన్నారు.

తాజావార్తలు


logo