మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Feb 02, 2020 , 03:39:43

మేడారంలో మంత్రులు బిజీ

మేడారంలో మంత్రులు బిజీ
  • అమ్మవారి జాతర అద్భుతంగా జరగాలని ఆదేశం
  • ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క
  • జాతర సక్సెస్‌కు సలహాలు, సూచనలు

ములుగు, నమస్తే తెలంగాణ: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మేడారం పర్యటన శనివారం బిజీబిజీగా సాగింది. మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు వారు గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. వారికి  జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గండ్రకోట సుధీర్‌యాదవ్‌, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ దర్శనం అనంతరం 2:14గంటలకు మేడారం బయల్దేరారు. మంత్రులు 3:02 గంటలకు మేడారం చేరుకున్నారు. మంత్రులు, ప్రముఖుల రాక సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హరితహోటల్‌ వద్ద ఘన స్వాగతం పలికారు. మంత్రులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. భోజన విరామం అనంతరం మంత్రులు  ప్రత్యేక బస్సులో ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని టికెట్‌ కౌంటర్లను ప్రారంభించారు. జాతర సందర్భంగా ఆర్టీసీ ద్వారా చేపట్టిన సేవలను మంత్రులు వివరించారు. అక్కడి నుంచి కల్యాణ మండపానికి చేరుకొని మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. గద్దెల వద్దకు చేరుకోగా మంత్రులకు మేడారం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. డోలి వాయిద్యాల మధ్య మంత్రులు గిరిజన సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిలువెత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించారు. సాయంత్రం 5:08 నిమిషాలకు హెలిప్యాడ్‌కు చేరుకొని హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. కాగా, మంత్రులతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు. మంత్రులకు హెలిప్యాడ్‌ వద్ద జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, వాసం వెంకటేశ్వర్లు, నోడల్‌ ఆఫీసర్‌ గౌతమ్‌, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు తదితరులు వీడ్కోలు పలికారు.

 

మంత్రుల పర్యటనకు బందోబస్తు  

జిల్లాలో శనివారం ముగ్గురు మంత్రులు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మానుకోట ఎంపీ పర్యటన సందర్భంగా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ పర్యవేక్షణలో ఓఎస్డీ సురేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్‌, సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. డాగ్‌ స్వాడ్‌తో కల్వర్టులను తనిఖీ చేశారు. సీఆర్పీఎఫ్‌ ప్రత్యేక బలగాలతో సమస్యాత్మక ప్రాంతా ల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. 


మీడియా సహకారం అవసరం 

తాడ్వాయి/ ఏటూర్‌నాగారం: మహాజాతర సందర్భంగా టీటీడీ కల్యాణ మండపంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్‌ను మంత్రులు, అతిథులు శనివారం ప్రారంభించారు. మీడియా ప్రతినిధులకు జాతర వార్తలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. జాతర విజయవంతానికి మీడియా సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. వెంట ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్‌, సమాచారశాఖ సంయుక్త సంచాలకులు డీఎస్‌ జగన్‌, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు ఉన్నారు. 


logo