ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Feb 01, 2020 , 03:25:48

సురక్షిత ప్రయాణం సులువైన దర్శనం..

సురక్షిత ప్రయాణం సులువైన దర్శనం..

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా, సులువుగా తల్లులను దర్శించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ సీపీ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. జాతర మార్గంలో ప్రమాదాలు, దొంగతనాలు, తొక్కిసలాటలు జరగకుండా చూస్తామని చెప్పారు. ములుగు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, ఏఎస్పీ సాయి చైతన్యతో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రవీందర్‌ మా ట్లాడారు. మేడారం వచ్చే వాహనాల పార్కింగ్‌కు 29 ప్రాంతా ల్లో 12 వందల ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 2 లక్షల 50 వేల వాహనాలు పార్కింగ్‌ చేసేలా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముగ్గురు డీసీపీల పర్యవేక్షణలో మూడు ఎంట్రెన్స్‌ల వద్ద ట్రాఫిక్‌  నియంత్రణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. 20 సెక్టార్లలో అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తామని, మల్లంపల్లి నుంచి ఊరట్టం వరకు ఫోర్‌ వీలర్‌ వెళ్లలోని చోట 30 మంది సిబ్బందితో ద్విచక్ర వాహనాలతో సేవలందిస్తామన్నారు.  గట్టమ్మ దేవాలయం నుంచి పస్రా వరకు 200 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. వరంగల్‌ నుంచి పస్రా వరకు వాహనదారులు విశ్రాంతి తీసుకోవడానికి 25 పార్కింగ్‌ ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో లైటింగ్‌, తాగునీరు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు 4వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. రోడ్ల వెంట ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలను నిలుపవద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ఓవర్‌ టేక్‌ చేయొద్దని సీపీ కోరారు.


మేడారానికి నాలుగు దారులు

మేడారం వచ్చే వాహనాలను నాలుగు రహదారుల నుంచి అనుమతిస్తున్నట్లు సీపీ తెలిపారు. వరంగల్‌, మహబూబాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను పస్రా, నార్లపూర్‌ మీదుగా మేడారం పంపుతామని, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో నార్లాపూర్‌, కాలువపల్లి, బయ్యక్కపేట, గొల్లబుద్ధారం, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, కమలాపూర్‌, కిట్స్‌ కళాశాల నుంచి జాతీయ రహదారికి చేరుకుంటాయని తెలిపారు. ఆర్‌టీసీ బస్సులు వరంగల్‌ నుంచి పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకొని, దర్శనం అనంతరం ఇదే మార్గంలో తిరుగు ప్రయాణిస్తాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఏటూరునాగారం, భద్రాచలం నుంచి వచ్చే వాహనాలు చిన్నబోయినపల్లి, కొండాయి మీదుగా ఊరట్టం చేరుకొని, దర్శనం అనంతరం ఇదే మార్గంలో తిరుగు ప్రయాణమవుతాయని తెలిపారు. మహారాష్ట్ర, కరీంనగర్‌, రామగుండం నుంచి వచ్చే వాహనాలు కాటారం, పగడపల్లి, కాలువపల్లి, ఊరట్టం పార్కింగ్‌కు చేరుకొని, దర్శనం అనంతరం నార్లాపూర్‌, బయ్యక్కపేట, కాటారం, రామగుండం, మహారాష్ట్ర వైపు తిరుగు ప్రయాణం అవుతాయని వెల్లడించారు. 


హైవేలపై బైపాస్‌లు సిద్ధం

హైదరాబాద్‌ నుంచి మేడారం వరకు ఉన్న జాతీయ రహదారులపై మరమ్మతు పనులు జరుగుతున్న ప్రదేశాల్లో బైపాస్‌ రోడ్లు వేసినట్లు సీపీ తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథ్‌పల్లి వద్ద రోడ్డుకు ఇరువైపులా, ఆరెపల్లి వద్ద నిర్మిస్తున్న టోల్‌గేట్‌ వద్ద, పస్రా బ్రిడ్జి వద్ద బైపాస్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆత్మకూర్‌ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కావచ్చిందని, కటాక్షపూర్‌ చెరువు మత్తడిని వెడల్పు చేసినట్లు సీపీ వివరించారు. 


10వేల మందితో భద్రత

మేడారం జాతరకు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటు ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ తెలిపారు. నాలుగు వేల మంది సిబ్బందితో ట్రాఫిక్‌ నియంత్రిస్తామన్నారు. నలుగురు డీసీపీలు, 29 మంది ఏఎస్పీలు, 100 మంది డీఎస్పీలు, 240 మంది సీఐలు, 770 మంది ఎస్సైలు, 8857 మంది పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులతో బందోబస్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాతరలో దొంగతనాలు, తొక్కీసలాటలు, ప్రమాదాలు జరగకుండా అ త్యాధునిక సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. జంపన్నవాగు నుంచి గద్దెల వరకు వృద్ధులు, దివ్యాంగులకు బ్యాటరీ ఆటోలతో రవాణా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర స జావుగా సాగడానికి భక్తులు, అధికారులు, సిబ్బంది, మీడియా సహకరించాలని కోరారు. 


logo