బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jan 31, 2020 , 04:28:40

ఒంటి గంటకే తాళం

 ఒంటి గంటకే తాళం

మహాముత్తారం, జనవరి30: మండలంలోని ములుగుపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, ఫిజియోథెరపీ సెంటర్లు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకే తలుపులు మూసుకున్నాయి. గ్రామంలోని రోగులు అవస్థతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి, ఫిజియోథెరపీ సెంటర్‌కు చేరుకోగా అక్కడ తలుపులకు తాళాలు వేసి ఉండడంతో పరుగున కాటారంలోని ప్రవేట్‌ దవాఖానకు వెళ్లారు. ములుగుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ముగ్గురు ఆశ కార్యకర్తలు, ఇద్దరు ఏఎన్‌ఎంలతో పాటు ఒక ఎమ్‌ఎల్‌ఎచ్‌పీ స్టాఫ్‌నర్స్‌ ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతీనెల భారీ మొత్తంలో వేతనాలు అందజేస్తున్నా, విధుల విషయంలో సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తునారు. మండలంలోని మొత్తం తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా, అందులో రెండు వెల్‌నెస్‌ సెంటర్లుకాగా ములుగుపల్లి ఆరోగ్య ఉపకేంద్రం వెల్‌నెస్‌ సెంటర్‌ కావడం మరోవిశేషం. 


వెల్‌నెస్‌ సెంటరే ఈ విధంగా ఉంటే మిగతా హేల్త్‌ సెంటర్లలో వైద్య సిబ్బంది ఏ విధంగా విధులకు హాజరు అవుతున్నారో అర్థం అవుతున్నది. మహాముత్తారం మండలం గిరిజన ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో సిబ్బంది తమకు ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరు అవుతున్నారని పేర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంతో పాటు, ఫిజియోథెరపీ సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరుకు రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉండగా, ములుగుపల్లి గ్రామంలోని వైద్య సిబ్బంది ఒంటి గంట సమయం లోపు విధులకు స్వస్తి చేప్పి ప్రభుత్వ లక్షాన్ని నీరుగారుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ములుగుపల్లి సబ్‌ సెంటర్‌, ఫిజియోథెరపీ సెంటర్‌ ఒంటి గంటకే మూసిఉన్న విషయం గురించి స్థానిక వైద్యుడు గోపీనాథ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఏఎన్‌ఎంలు నెలవారీ మీటింగ్‌కు హాజరయ్యాని చెప్పారు. అలాగే, ఆశవర్కర్లు ఎమ్‌ఎల్‌ఎచ్‌పీ స్టాఫ్‌నర్స్‌ ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు సబ్‌సెంటర్‌లో విధులు నిర్వహించాలని చెప్పారు.


logo