బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jan 30, 2020 , 03:20:57

ఘనంగా మండమెలిగె పండుగ

ఘనంగా మండమెలిగె పండుగ
  • అమ్మవార్లకు తొలిపూజలు నిర్వహించిన పూజారులు
  • గ్రామాల్లోకి దుష్టశక్తులు రాకుండా ధ్వజ స్తంభాల ఏర్పాటు

తాడ్వాయి, జనవరి 29 : మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్కల పూజారులు మండమెలిగె పండగను ఘనంగా నిర్వహించారు. మొదట సమ్మక్క పూజామందిరంలో తల్లి గద్దెను శుద్ధి చేశారు. అనంతరం అమ్మవార్ల పూజా సామగ్రిని పూజారులు సిద్ధబోయిన మునీందర్‌, క్రిష్ణయ్యలు శుద్ధి చేశారు. గత జాతర సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం భద్రపరిచిన పూజాసామగ్రిని బయటకు తీసి శుద్ధి చేశారు. అనంతరం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారుల కుటుంబాలకు చెందిన ఆడపడుచులు తల్లి గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ముగ్గులతో అలంకరించారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోలివాయిద్యాల నడుమ గ్రామం మధ్యలోని బొడ్రాయి, పోశమ్మ గుళ్లకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన పూజారి మునీందర్‌ ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమ తీసుకుని గ్రామ శివారుకు చేరుకున్నారు. బూరుగు కర్రలతో గ్రామానికి వచ్చే రెండు ప్రధన రహదారులకు ఇరువైపులా మామిడి తోరణాలు, ఆనపకాయ బుర్రతోపాటు కోడిపిల్లను కట్టి ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా కట్టు వేశారు. ధ్వజ స్తంభాల వద్ద కల్లు సాకను ఆరబోశారు. అక్కడి నుంచి సమ్మక్క పూజా మందిరానికి చేరుకుని నైవేద్యాలను సమర్పించారు. అక్కడి నుంచి చెలపెయ్యను స్వీకరించిన అనంతరం సమ్మక్క-సారక్కల గద్దెల వద్దకు చేరుకుని గద్దెలకు అలుకుపూతలు నిర్వహించి చెలపెయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మండమెలిగే పండుగతో మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు సంకేతాలు ఇస్తారు. 


కన్నెపల్లి సారక్క మందిరంలో.. 

కన్నెపల్లిలోని సారక్క దేవాలయంలో కాక వంశీయులు మండమెలిగె పండుగను నిర్వహించారు. సారక్క పూజారి కాక సారయ్య అమ్మవారి పూజా సామగ్రిని శుద్ధి చేసి అమ్మవారి పూజా మందిరాన్ని నీటితో కడిగి శుభ్రం చేశారు. తల్లి అడేరాలను శుద్ధి చేసి అలంకరించారు. గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అడేరాలకు చీరె, సారె, పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు. పూజా మందిరాన్ని పూలతో అలంకరించారు. 


రాత్రంతా జాగారాలు.. 

మేడారంలోని సమ్మక్క పూజా మందిరం, కన్నెపల్లిలోని సారక్క పూజా మందిరంలో మండమెలిగె పండుగను నిర్వహించిన పూజారులు రాత్రి గద్దెల వద్ద జాగారాలు చేయనున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దెల ఆవరణలో ఉన్న రహస్య పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నా రు. కన్నెపల్లి నుంచి సారక్క పూజారులు, మే డారం నుంచి సమ్మక్క పూజారులు రాత్రి 8గంటల సమయంలో తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటారు. ఒకరికొకరు సాకను ఇచ్చిపుచ్చుకుని రహ స్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రంతా గద్దెల ఆవరణలో జాగారాలు నిర్వహించి గురువారం తెల్లవారుజామున ఆయా పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇళ్లకు చేరుకుంటారు. రాత్రంతా డోలి వాయిద్యా ల నడుమ పూజలు నిర్వహిస్తు జాగారాలు నిర్వహించనున్నారు. ఇప్పటినుంచి సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువచ్చే పూజా రి కొక్కెర క్రిష్ణయ్య, కన్నెపల్లి నుంచి సారక్క దేవతను గద్దెపైకి తీసుకువచ్చే పూజారి కాక సారయ్య లు అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. మహా జాతర ముగిసిన అనంతరం వచ్చే బుధవారం అమ్మవార్ల మందిరాల్లో నిర్వహించే తిరుగువారం పండుగ వరకు వారు కాళ్లకు చెప్పులు లేకుండా రోజు అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజారుల పూజా కార్యక్రమాలు ఉన్న కారణంగా రాత్రి 8గంటల నుంచి గురువారం ఉదయం 6 వరకు భక్తులను అమ్మవార్లను దర్శించుకునేందుకు అనుమతించరు.  


logo