ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jan 30, 2020 , 03:19:45

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ : 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. జాతరలో 10 వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నామన్నారు. బుధవారం మేడారం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఐజీ ప్రమోద్‌కుమార్‌, మేడారం ట్రాఫిక్‌ ఇన్‌చార్జి, వరంగల్‌ సీపీ డాక్టర్‌ రవీందర్‌, ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. జాతర పూర్తి నిర్వహణ బాధ్యతలను తాను పర్యవేక్షిస్తానని, ఐజీ ప్రమోద్‌కుమార్‌ శాంతిభద్రతలను, వరంగల్‌ సీపీ రవీందర్‌ ట్రాఫిక్‌ నియంత్రణ బాధ్యతలను, రామగుండం సీపీ సత్యనారాయణ దేవాలయ ప్రాంగణంలో నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. గత జాతర అనుభవాలను దృష్టి లో పెట్టుకొని మేడారం జాతర ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను రోడ్డుపై నిలుపరాదని విజ్ఞప్తి చేశారు.


వన్‌వేల ద్వారా రాకపోకలు.. 

 వరంగల్‌, పస్రా మీదుగా ప్రైవేటు వాహనాలు ఊరట్టం చేరుకుంటాయని, ఆర్టీసీ, పాస్‌ కలిగిన ప్రైవేటు వాహనాలు తాడ్వాయి మీదుగా మేడారానికి చేరుకుంటాయని ఐజీ వెల్లడించారు. కరీంనగర్‌, మహదేవ్‌పూర్‌, అదిలాబాద్‌, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం మీదుగా కాల్వపల్లి చేరుకుంటాయని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే వాహనాలు కొండాయి మీదుగా ఊరట్టం చేరుకుంటాయన్నారు. ప్రధాన రహదారుల్లోని పార్కింగ్‌ ప్రదేశాల్లో 1800 విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఓవర్‌టేక్‌ చేయొద్దు.. 

భక్తులు తమ ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్‌ చేయొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పస్రా, ములుగు మొదలుకొని వరంగల్‌ వరకు ప్రతి 4 కిలోమీటర్లకు పోలీస్‌ ఔట్‌ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం-పస్రా మధ్య ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీస్‌ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ క్యాంపు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్విచక్ర వాహనంపై రహదారిలో పర్యటించి ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటారని, ట్రాఫిక్‌ జామ్‌ తలెత్తితే కమాండ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం  ఇచ్చి క్లియర్‌ చేయనున్నట్లు ఐజీ తెలిపారు. 


నిరంతరాయంగా దర్శనం.. 

గతంలో మాదిరిగా జాతరకు వచ్చిన భక్తులు దర్శనం మధ్యలో అరగంట వ్యవధి ఉండేదని, ఈ జాతరలో భక్తులు నిరంతరాయంగా తల్లులను దర్శించుకొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా భక్తులను త్వరగా బయటకు పంపిస్తామన్నారు. స్నానఘట్టాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. ములుగు-మేడారం మధ్య 330 సీసీ కెమెరాలు, 20 పీటీజెడ్‌ కెమెరాలను అమర్చామన్నారు. దేవాలయం నుం చి జంపన్నవాగుకు వెళ్లే ప్రధానమార్గానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


హాల్టింగ్‌ పాయింట్లు.. 

జాతరకు వచ్చే భక్తులు విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామని, అక్కడ మాత్రమే వాహనాలను నిలుపాలని ట్రాఫి క్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ అన్నారు. వరంగల్‌ నగరంలో 28 కిలోమీటర్ల మేర ఉన్న బైపాస్‌ రోడ్డులో 18 కిలోమీటర్ల మేర క్లియర్‌ అ యిందన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు బైపాస్‌ గుండా చింతగట్టుకు చేరుకుని అక్క డి నుంచి కేయూసీ, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు ద్వారా మేడారానికి వచ్చే విధంగా ట్రాఫిక్‌కు ని యంత్రించినట్లు తెలిపారు. జాతరకు వచ్చిన వా హనాలు బయ్యక్కపేట, కామారం, భూపాలపల్లి, కమలాపురం మీదుగా కిట్స్‌ కాలేజీకి చేరుకొని జాతీయ రహదారి బైపాస్‌ మీదుగా వెళ్తాయని తె లిపారు. జాతరను 10 సెక్టార్లుగా విభజించామని, ప్రతి సెక్టార్‌ను ఏఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారన్నారు. గోవిందరావుపేట బ్రిడ్జి వద్ద డైవర్షన్‌ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, భక్తులు మితిమీరిన వేగంతో ప్రయాణించొద్దన్నారు. సమావేశం లో ఓఎస్డీ సురేశ్‌ కుమార్‌, ఏఎస్పీలు సాయిచైత న్య, శరత్‌చంద్రపవార్‌ పాల్గొన్నారు. 


logo