శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jan 29, 2020 , 03:19:49

నేడు మండమెలిగే పండుగ

నేడు మండమెలిగే పండుగ

జనవరి 28: వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క సారక్క పూజారులు నేడు(బుధవారం) మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే అమ్మవార్ల మహాజాతరకు ముందు వచ్చే బుధవారం తల్లులకు మండమెలిగే పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో సిద్ధబోయిన వంశస్థులు, సారక్క కొలువైన కన్నెపల్లిలో కాక వంశీయులు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మొదట తల్లుల గద్దెల వద్దకు వెళ్లి పూజారులు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌ ఇంటికి చేరుకుని అక్కడి  నుంచి పసుపు, కుంకుమలు, మామిడి తోరణాలు స్వీకరిస్తారు. డోలి వాయిద్యాల మధ్య గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులకు బురుగు చెట్ల కర్రలతో ధ్వజ స్తంభాలు ఏర్పాటు చేసి మామిడి తోరణాలు కడతారు. ప్రాణంతో ఉన్న కోడిపిల్లను కట్టి, ఊరి కట్టడి చేస్తారు. అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సమ్మక్క దేవత పూజా మందిరానికి చేరుకుని తల్లి గద్దెను, గుడిని శుద్ధి చేస్తారు. గత జాతర సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భద్రపర్చిన పూజా సామగ్రిని సమ్మక్క దేవతను తీసుకువచ్చే పూజారి కొక్కెర క్రిష్ణయ్య, సారక్క దేవతను తీసుకువచ్చే కాక సారయ్య, కిరణ్‌ బయటకు తీసి, శుద్ధి చేస్తారు. తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మహాజాతర ప్రారంభమైనట్లు సంకేతాలు ఇస్తారు. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని తల్లును గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ మండమెలిగే పండుగతో పూజలు ప్రారంభమవుతాయి. అమ్మవార్ల మహాజాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం తిరుగువారం పండుగ చేస్తారు. అప్పటి వరకు.. అంటే పదిహేను రోజుల పాటు పూజారులు ప్రత్యేక పూజలను కొనసాగిస్తారు. పూజల అనంతరం సమ్మక్క పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి తరలివెళ్తారు. కన్నెపల్లి నుంచి సారక్క పూజారులు బయలుదేరి గద్దెల వద్దకు వస్తారు. సిద్ధబోయిన, కాక వంశీయులు ఒకరికొకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. తల్లుల గద్దెల ప్రాంగణంలో రాత్రంతా పూజలు నిర్వహిస్తారు. జాగారాలు చేస్తారు. ఆ సమయంలో గద్దెల వద్దకు భక్తులను అనుమతించరు. రాత్రంతా జాగారం నిర్వహించిన అనంతరం వేకువజామున సమ్మక్క-సారక్క పూజా మందిరాల వద్దకు చేరుకుని తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పూజారులు, వారి కుటుంబ సభ్యులు అత్యంత నియమ నిష్ఠలు పాటిస్తారు. కాళ్లకు చెప్పులు లేకుండా పదిహేను రోజులు గడుపుతారు.

సుందరంగా గద్దెల ప్రాంగణం 

నేడు మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో మండమెలిగే పండుగను నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు, పూజారులు తల్లుల గద్దెలను పూలతో అందంగా అలంకరిస్తున్నారు. తల్లుల గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌తో పాటు సాలహారం, గుడి గంటలకు పూలను అలంకరిస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. logo