మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 29, 2020 , 03:12:48

భక్తజన మేడారం

భక్తజన మేడారం

తాడ్వాయి/ మంగపేట, జనవరి 28: మేడారం భక్తులతో నిండిపోతున్నది. వనదేవతల ఆశీస్సులు పొందేందుకు ముందస్తుగా వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. మంగళవారం ఒక్కరోజే సుమారు లక్షా ఇరవై వేల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ర్టాల నుంచి భక్తులు మేడారం బాట పట్టారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాల్లో మేడారం చేరుకున్న భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేశారు. తలనీలాలు ఇచ్చారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకొని ఎత్తు బెల్లం, పసుపు, కుంకుమ, చీరలను సమర్పించి మొక్కులు అప్పగించారు. యాటలు, కోళ్లు కోళ్లు బలిచ్చి, గద్దెల సమీపంలో విడిది చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. మహాజాతరకు వారం రోజుల సమయం ఉండడం, ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్న భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. నేడు మండెమెలిగే పండగను నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వనదేవతలను రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, మాజీ మంత్రి గొడిశాల రాజేశం గౌడ్‌ శ్యామలాదేవి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారికి గిరిజన సంప్రదాయ పద్ధతిలో, డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆయన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు నిర్వహించి బెల్లం, పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. పూజారులు రాజేశంగౌడ్‌ దంపతులకు అమ్మవార్ల శేష వస్ర్తాలు, ప్రసాదాలు అందించారు.


logo