సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 28, 2020 , 05:19:12

మేడారంలో కోలాహలం..

మేడారంలో కోలాహలం..

తాడ్వాయి/ వెంకటాపూర్‌, జనవరి 27: మేడారం జనసంద్రంగా మారుతున్నది. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక, శాశ్వత అభివృద్ధి పనులు పూర్తికాగా, భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు చెల్లిస్తున్నారు. ఐటీడీఏ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, భక్తులు ఎత్తుబెల్లం (బంగారం) ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. సోమవారం ఉదయం వరకే పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి, తలనీలాలు ఇచ్చారు. గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క, సారక్కకు ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, సారె పెట్టి గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. సమ్మక్క-సారక్కను సోమవారం సుమారు 1లక్షా యాభైవేల మంది భక్తులు దర్శించుకు న్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులతో పాటు పెద్దసంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలివచ్చారు.  భక్తుల కొ నుగోళ్లతో పలు దుకాణ సముదాయాలు కళకళలాడాయి. మహాజాతరకు ముందు వ్యాపారాలు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయలకు, కోళ్లకు గిరాకీ జోరుగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు మేడారంతో పాటు రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్‌, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుంటున్నారు. వారానికి సరిపడా సరంజామను సమకూర్చుకుంటున్నారు. పిల్లల ఆటవిడుపునకు ఎగ్జిబిషన్లు వెలుస్తున్నాయి. ప్రైవేట్‌ వాహనాల పార్కింగ్‌ కోసం స్తలాన్ని కేటాయించారు. ఆర్టీసీ బస్సులు గద్దెల వద్దకు భక్తులను చేరువేస్తున్నాయి. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ప్లాస్టిక్‌ రహిత జాతరకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. జాతర నేపథ్యంలో వస్తువుల దిగుమతిలో వేగం పుంజుకుంది. టెండర్ల ద్వారా స్థలాలను ఖరారు చేసుకున్న వ్యాపా రులు స్టాల్స్‌ ప్రారంభిస్తున్నారు. చికెన్‌సెంటర్లు, మద్యం దుకాణాలు, బెల్లం, కొబ్బరికాయలు వివక్రయించే షాపులు, హోటళ్లు, టీస్టాల్స్‌, టిఫిన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే గండ్ర దంపతుల పూజలు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి దంపతులు వనదేవతలను సోమవారం దర్శించుకున్నారు. భూపాలపల్లి మున్నిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వారికి పూజారులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, ఒడిబియ్యం, పూలు, పండ్లు వేసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. 


గట్టమ్మ వద్ద భక్తుల సందడి

ములుగురూరల్‌, జనవరి 27:  ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద సోమవారం భక్తుల సందడి కనిపిస్తున్నది. మేడారంలో సమ్మక్క-సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న వే లాది మంది భక్తులు గట్టమ్మ తల్లికి మొదటి మొక్కు చెల్లించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పూజలు చేశారు.

  29న ఆదిదేవత గట్టమ్మకు ఎదురుపిల్ల 

గట్టమ్మ తల్లికి ఈ నెల 29న ఎదురుపిల్ల పండుగ నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ దేవాలయ పూజారి కొత్త సమ్మయ్య, కొత్త లక్ష్మయ్య, ఆరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, చిర్ర రాజేందర్‌, మండపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం సం యుక్త ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాల మధ్య కనువిందు చేసే రీతిలో పండుగ చేపడుతామ  పేర్కొన్నారు. ప్రతీ ఇంటి నుంచి భోనాలు, ఆదివాసీల నృత్యాలు సంబురాలతో అమ్మవారికి ఎదురుపిల్లను ఇస్తామని తెలిపారు. ఆదివాసీ ప్రజాసంఘాల జేఏసీ, జిల్లా యంత్రాంగం, పొలిటికల్‌ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.


logo