గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 28, 2020 , 05:11:58

పుర పీఠంపై గులాబీ జెండా

పుర పీఠంపై గులాబీ జెండా

భూపాలపల్లి టౌన్‌, జనవరి 27 : భూపాలపల్లి ము న్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఎవరికి వరిస్తాయోనని సభ్యులు ఉత్కంఠగా ఎదురు చూశారు. సెగ్గం వెంకటరాణి, చల్లూరి మమత, దార పూలమ్మ పేర్లు వినిపించాయి. చైర్‌పర్సన్‌ పదవి ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సభ్యులెవరికి చైర్‌పర్సన్‌ పదవి వరిస్తుందో ఎన్నికకు పది నిమిషాల ముందు వరకు ఎవరికీ తెలియలేదు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దూతగా వచ్చిన రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి ప్రకటించే వరకు సభ్యులకు తెలియలేదు. వైస్‌ చైర్మన్‌ పరిస్థితి అంతే. నరాలు తెగే టెన్షన్‌లో అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి బస్సులో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలకు నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్డీవో గణేశ్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్స్‌ అఫిషియో సభ్యులు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎన్నికల వ్యయ పరిశీలకులు భరత్‌రెడ్డి, కమిషనర్‌ సమ్మయ్య పాల్గొన్నారు. 30 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 11.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తి కాగా, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక 12.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో గణేశ్‌ ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రారంభమైంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ సెగ్గం వెంకటరాణిని 29వ వార్డు కౌన్సిలర్‌ చల్లూరి మమత ప్రతిపాదించారు. 14వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ దార పూలమ్మ బలపరిచారు. వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా 12వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ కొత్త హరిబాబును 24వ వార్డు కౌన్సిలర్‌ శిరుప అనిల్‌ ప్రతిపాదించారు. 27వ వార్డు కౌన్సిలర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి బలపరిచారు. ఈ క్రమంలో పోటీలో ఎవరూ లేకపోవడంతో సెగ్గం వెంకటరాణిని చైర్‌పర్సన్‌గా, కొత్త హరిబాబును వైస్‌ చైర్మన్‌గా ఆర్డీవో ప్రకటించారు. 

నూతన పాలకవర్గానికి అభినందనలు

నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, కమిషనర్‌ సమ్మయ్య అభినందనలు తెలిపారు. ముందుగా చైర్‌పర్సన్‌ వెంకటరాణికి ఆర్డీవో గణేశ్‌ పుష్పగుచ్ఛం అందించారు. వైస్‌ చైర్మన్‌ హరిబాబుకు ఎన్నికల వ్యయ పరిశీలకులు భరత్‌రెడ్డి పుష్పగుచ్ఛం అం దించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లందరికీ ఒక్కొక్కరికి స్వయంగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 


logo