శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 27, 2020 ,

సీఎంను జాతరకు ఆహ్వానించిన మంత్రులు

సీఎంను జాతరకు ఆహ్వానించిన మంత్రులు

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు కుటుంబ సమేతంగా రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌లు సీఎం కేసీఆర్‌కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను ఆదివారం ప్రగతి భవన్‌లో అందించారు. అనంతరం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రులతో సీఎం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి  అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు జాతర పరిస్థితిని ప్రత్యేక్షంగా సమీక్షించేందుకు, మేడారానికి వెళ్లి రావడానికి ఫిబ్రవరి 5వ తేది నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని సీఎం వెల్లడించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని, తాగునీరు, పారిశుధ్యం తదితర విషయాలపై ఏ మాత్రం ఏమరుపాటు వహించరాదని ఆదేశించారు. 

క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో సరైన వ్యూహం అనుసరించాలని సీఎం అధికారులకు సూచించారు. గతంలో వరంగల్‌ జిల్లాలో పనిచేసి మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను అక్కడికి పంపాలని, అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, దేవాదాయ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, అడిషన్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, మేడారం ఆలయ ఈవో రాజేంద్రం, ఆలయ  పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ రామ్మూర్తి, ప్రధాన పూజారి సిద్ధబోయిన  జగ్గారావుతోపాటు పాలక మండలి సభ్యులు ఉన్నారు.   logo