శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jan 27, 2020 ,

మంత్రులు ప్రారంభించిన రిసార్ట్‌కు తాళం వేసిన పోలీసులు

మంత్రులు ప్రారంభించిన రిసార్ట్‌కు తాళం వేసిన పోలీసులు

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలకేంద్రంలో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాకతీయ హరితహోటల్‌, రిసార్ట్స్‌ను ఈ నెల 24వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రులచే ప్రారంభింపబడిన రిసార్టుకు అనుమతి లేదని, రిసార్టు భవనంలో బాంబు ఉందని బెదిరిస్తూ పోలీసు అధికారులు తాళం వేశారు. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు, పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు రిసార్టులో ఉన్న 30గదుల్లో 15గదులను 15రోజుల పాటు తమకు ఉచితంగా ఇవ్వాలని అడిగినందున  నిర్వాహకులు 15రోజుల పాటు అన్ని రూములు ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో పోలీసు అధికారులు అనుమతి లేదని, బాంబు ఉందనే కారణాలతో రిసార్టును మూసి వేసి తాళం వేసినట్లుగా చర్చ సాగుతున్నది.

వికటించిన పోలీసుల వన్‌వే ప్రయోగం ..

ముందస్తుగా మేడారం జాతరను కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుందామని ఆశ పడి వచ్చిన భక్తులకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల భక్తులు తీవ్రట్రాఫిక్‌ అంతరాయంతో ఇబ్బందులకు గురయ్యారు. మేడారం జాతరకు వచ్చే నెల 2వ తేదీనుంచి వన్‌వే కొనసాగించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, శనివారం, ఆదివారాలలో తాడ్వాయి నుంచి మేడారానికి చేరుకునే రహదారిని పూర్తిగా మూసివేస్తూ కేవలం పస్రా నుంచి మేడారానికి మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించి రెండు రోజుల పాటు వన్‌వే కొనసాగించారు. ఆదివారం పోలీసులు ప్రయోగించిన వన్‌వే విధానం వికటించి తాడ్వాయి మండలం నార్లాపూర్‌ నుంచి జంపన్నవాగు వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నార్లాపూర్‌ నుంచి జంపన్నవాగు వరకు సుమారు 6కిలో మీటర్లమేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురై పోలీసుశాఖ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పస్రా నుంచి మేడారం వరకు ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బంది పడ్డ భక్తులు రోడ్డంతా వాహనాలతో కిలో మీటర్లమేర నిలిచిపోయి రద్దీగా మారింది. కాగా, తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రహదారిలో వాహనాలు లేక వెలవెలబోతూ గేదెలు యథేచ్ఛగా తిరుగాడటం భక్తులను విస్మయానికి గురిచేసింది. పోలీసు అధికారులు వన్‌వే పై ముందస్తు ప్రచారం చేపట్టకుండా వన్‌వే విధానం అమలు చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో గంటల తరబడి వాహనంలో కూర్చొవడం ఇబ్బంది కరంగా మారిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 


logo