గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jan 26, 2020 , 03:59:29

మహాజాతర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి

మహాజాతర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి
  • పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ
  • కమిషనర్‌ రఘునందన్‌రావు

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు సూచించారు. శనివారం ఆయన  మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తొలుత చిలుకలగుట్ట ప్రహరీకి వేసిన పెయింటింగ్‌ చిత్రాలను చూపి అద్భుతంగా ఉన్నట్లు తెలిపారు. పెయింటింగ్‌లతో గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసే అ వకాశం కలుగుతుందని అన్నారు. అనంతరం జంపన్నవాగు వద్ద కల్యాణకట్టతోపాటు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. స్టాల్స్‌ వద్ద డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయడంతోపాటు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల ని అన్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న షెడ్‌ల నిర్మాణంలో వేగం పెంచి జాతర లోపు భక్తులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. పార్కింగ్‌ స్థలాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని  చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ నిరంతరం కొనసాగిస్తూ భక్తులకు  చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీపడకుండా ప్రతీ అంశంలో నాణ్యత పాటించాలని అన్నారు. జాతరలో భక్తులకు పూర్తి స్థాయి అవగాహన ఏర్పర్చేందుకు సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సఫాయి కర్మచారీలను అందుబాటులో ఉంచాలని అన్నారు. క్షౌరశాలల్లో నాయీబ్రాహ్మణులు భక్తుల నుంచి అధిక మొత్తం వసూళ్లు చేయకుండా నిర్దేశించిన రేటును నిర్ణయించాలని అన్నారు. జాతర పూర్తయినా కూడా నెలరోజులపాటు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ మేడారం పరిసర గ్రామాల్లో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఇతర అధికారులతో కలిసి వనదేవతల దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో పారిజాతం, ములుగు, భూపాలపల్లి జిల్లా డీపీవోలు వెంకయ్య, చంద్రమౌళి, పంచాయతీరాజ్‌ ఈఈ రాంబాబు, మేడారం ఈవో రాజేందర్‌, ఎస్పీవో వీరన్నతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.logo