గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jan 25, 2020 , 02:17:29

సంస్కృతి ఉట్టిపడేలా మహా జాతర

సంస్కృతి ఉట్టిపడేలా మహా జాతర
  • - భక్తులకు సకల సౌకర్యాలు
  • - అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావాలి
  • - 7న సీఎం కేసీఆర్‌ వచ్చే అవకాశం
  • - పర్యాటక శాఖ హోటళ్లలో తెలంగాణ వంటకాలు
  • -మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌
  • - మేడారంలో పర్యటన, తాడ్వాయి హట్స్‌ ప్రారంభం
  • - పారిశుధ్య నిర్వహణపై ఆగ్రహం


‘సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం జాతర నిర్వహిస్తాం. సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం.    భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మొదట తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్‌ను ప్రారంభించారు. అనంతరం మేడారం చేరుకొని జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను    పలకరించి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం హోటల్‌ హరిత కాకతీయలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జాతర అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావాలన్నారు. ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్‌ తల్లులను దర్శించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటళ్లలో తెలంగాణ వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఉన్న టూరిజం    ప్యాకేజీలను జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వర్తింపజేస్తామని చెప్పారు.  
      - ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం మహాజాతరను నిర్వహిస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శుక్రవారం వారు పర్యటించారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారు తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్‌ను ప్రారంభించారు. అనంతరం మేడారం చేరుకొని వివిధ పనులను పరిశీలించారు. భక్తులను పలకరించారు. తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం హోటల్‌ హరిత కాకతీయలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతాన్ని పర్యటించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారాన్ని దేశంలోనే నంబర్‌వన్‌ జాతరగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. జాతరలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టామని, గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా మహా జాతర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన సీఎం కేసీఆర్‌ మేడారంలో మొక్కులు చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జాతర నేపథ్యంలో ఆదివాసీ గిరిజన సంఘాలు, దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తున్నామని  వివరించారు. జాతర సమయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జాతరలో పారిశుధ్య నిర్వహణపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 8,400 మరుగుదొడ్లకు గానూ 8వేలు మాత్రమే పూర్తి చేయడం, 400 మరుగుదొడ్లకు ఇప్పుడే గుంతలు తవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సాకుతో పనులను నిర్లక్ష్యం చేయవద్దని, జాతరకు సమయం సమీపిస్తున్నందున శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు డ్రెస్‌ కోడ్‌ ధరించి చీపుర్లు పట్టుకొని రోడ్లపై షో చేస్తున్నారని, వారిపై పర్యవేక్షణ లోపించిందని వెల్లడించారు. పారిశుధ్య పనులకు గ్రేటర్‌ వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి సుశిక్తులైన కార్మికులను రప్పించాలని ఆదేశించారు. గతంలో ఇక్కడ ఉత్తమంగా విధులు నిర్వహించి వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన అధికారులను గుర్తించి డిప్యుటేషన్‌పై తీసుకురావాలని సూచించారు. జాతరలో 80 గుడారాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  గోడలపై ప్రభుత్వ పథకాలు, గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించే చిత్రాలు వేయాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణకు చెందిన పర్యాటకులు గోవా, సింగపూర్‌ తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారని, ములుగు జిల్లాలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా స్థలాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్‌, హరిత కాకతీయలో తెలంగాణ వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఉన్న టూరిజం ప్యాకేజీలను జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వర్తింపజేస్తామని చెప్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.14కోట్లతో మేడారంలో హరిత హోటల్‌ నిర్మించామని, ఇక్కడ భోజనం చేసే వారికి రూపాయికే తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రూ. 10కోట్లతో 12 కాటేజీలను అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. వారి వెంట జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, మహబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, తెలంగాణ టూరిజం రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌రావు, రాష్ట్ర టూరిజం చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఓఎస్డీ సురేశ్‌కుమార్‌, డీఆర్వో రమాదేవి, జెడ్పీసీఈవో పారిజాతం, వ్యాపారవేత్త రవిచంద్ర, మేడారం పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ రామ్మూర్తి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

మేడారంలో సౌకర్యాలపై ఆరా

ములుగు నమస్తే తెలంగాణ/ తాడ్వాయి: మేడారంలో పర్యటించిన మంత్రులు వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు వచ్చిన వారికి పూజారులు, దేవాదాయశాఖ అధికారులు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్ముర్తి, డైరెక్టర్లు డోలివాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వారిని ఆలయ మర్యాదలతో సన్మానించారు. సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, బంగారం, పూలు, పండ్లు, పూలు, సారెను సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం వద్ద నిల్చుని పలువురు భక్తులతో వారు మాట్లాడారు. లోటుపాట్లను తెలుసుకున్నారు.logo