బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jan 24, 2020 , 04:51:38

తల్లుల దర్శనానికి బారులు

తల్లుల దర్శనానికి బారులు
  • -వనదేవతలకు దర్శనానికి పోటెత్తిన భక్తజనం
  • -భారీగా తరలివచ్చిన భక్తులు
  • -రద్దీగా మారిన మేడారం పరిసరాలు


తాడ్వాయి/ వెంకటాపురం(నూగూరు), జనవరి 23: మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారక్క తల్లుల గద్దెలను దర్శించుకునేందుకు గురువారం బారులుతీరారు. వరాలిచ్చే తల్లులు, వనదేవతలకు ముందస్తుగా మొక్కులు అప్పగించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా మేడారం వచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు వివిధ వాహనాల్లో మేడారం చేరుకున్నారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీట్యాప్స్‌ కింద స్నానాలు చేసి తలనీలాలు ఇచ్చారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకుని ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, సారె, పూలు, పండ్లు, ఒడిబియ్యం సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. తల్లులకు యాటపోతులను బలిచ్చి గద్దెల పరిసరాలతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో విడిది చేశారు. వంటలు వండుకొని బంధూమిత్రులు, కుటుంబ సమేతంగా భోజనాలు చేసి సాయంత్రం వేళ స్వగ్రామాలకు పయనమయ్యారు. జాతర పరిసరాల్లో వ్యాపారులు పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేయగా, అవి భక్తులతో కిటకిటలాడాయి. గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించారు. ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. భక్తుల వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశాలు నిండిపోయాయి. మొదట గద్దెల సమీపంలోకి వాహనాలను అనుమతిచ్చారు. రద్దీ పెరగడంతో రెడ్డిగుడెం క్రాస్‌, స్తూపం వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశాల్లోకి వాహనాలను మళ్లించారు.


logo