శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 23, 2020 , 02:20:38

అలుకు పూసి ముగ్గేసి

 అలుకు పూసి ముగ్గేసి
  • - ఘనంగా గుడిమెలిగే
  • - ఆలయాలను శుద్ధి చేసిన పూజారులు
  • - మేడారం, కన్నెపల్లిలో తల్లులకు పూజలు
  • - నేటి నుంచి తిరుగు వారం పండుగ వరకు అమ్మవార్లకు నిత్య పూజలు
  • - వన దేవతల సన్నిధిలో భక్తజనం
  • - క్యూలైన్ల ద్వారా దర్శనం

తాడ్వాయి/ గోవిందరావుపేట/ ములుగు రూరల్, జనవరి 22: మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరలో గుడిమెలిగే పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మహాజాతరకు పూజారులు ఆరునెలల క్రితం తేదీలను నిర్ణయించగా, బుధవారం గుడిమెలిగే పండుగతో పూజలు ప్రారంభించారు. మేడారంలో సమ్మక్క పూజా మందిరంలో, కన్నెపల్లిలోని సారక్క దేవాలయంలో సిద్దబోయిన, కాక వంశీయులు ప్రత్యేక పూజలు మొదలు పెట్టారు. వేకువజామున నిద్రలేచిన పూజారులు మొదటగా ఇళ్లను శుద్ధి చేశారు. అనంతరం నూతన వస్ర్తాలను ధరించి ఆయా గ్రామాల్లో పూజారులు, వంశీయులు ఆలయాలకు చేరుకున్నారు. మందిరాలను నీటితో శుద్ధి చేశారు. తల్లుల ప్రతిరూపమైన గద్దెలను శుభ్రపరిచారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో డోలివాయిద్యాల మధ్య సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించారు. గడ్డిని తల్లుల గద్దెల వద్ద భద్రపరిచారు. సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మనిందర్ ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమలు, పూజా సామగ్రిని తీసుకుని డోలివాయిద్యాల మధ్య ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవార్ల గద్దెల వద్దకు పూజా సామగ్రిని చేర్చారు.

గుట్ట గడ్డిని మందిరాలపై కప్పారు. పూజారుల ఆడపడుచులు తల్లి గద్దెకు మట్టితో అలుకుపూశారు. రంగులతో గద్దెను అందంగా అలంకరించి, ముగ్గులు వేశారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య ఆధ్వర్యంలో గత జాతర అనంతరం భద్రపరిచిన తల్లి పూజా సామగ్రిని బయటకు తీసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా పూజారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తల్లి గద్దెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లికి  యాటపోతును సమర్పించి మహాజాతర ప్రారంభానికి తొలిపూజలు చేశారు. కన్నెపల్లిలోని సారక్క పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్య, కిరణ్ తల్లి పూజా సామగ్రిని శుద్ధి చేశారు. తల్లి రూపంలో ఉన్న అడేరాలను శుద్ధి చేసి, పసుపు, కుంకుమ చల్లారు. గుడిమెలిగే పండగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు భావించి, తిరుగువారం వరకు అమ్మవార్లకు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చే బుధవారం మండెమెలిగే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మళ్లీ వచ్చే బుధవారం అమ్మవార్ల మహాజాతరను చేపడతారు.

పూర్వం నుంచి వస్తున్న ఆచారం..

పూర్వీకుల కాలం నుంచే తల్లులకు గుడిమెలిగే పండుగను నిర్వహిస్తున్నారు. గతంలో అమ్మవారి పూజామందిరం స్థానంలో గడ్డి గుడిసె ఉండేది. జాతర అభివృద్ధి చెందుతున్న కాలక్రమేనా గుడిసె స్థానంలో భవనం నిర్మించారు. పూర్వపు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజారులు గుడిమెలిగే పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో వారి పూర్వీకులు అమ్మవార్ల మహాజాతరకు ముం దు గుడిసెను గుట్ట గడ్డితో అలంకరించి, చుట్టూ ఉన్న గోడలకు మట్టితో అలుకుపూత నిర్వహించి, గుడిమెలిగే పండుగను నిర్వహించేవారు. గుడి స్థా నంలో భవనం నిర్మించినా పూజారులు అదే సం ప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మవార్ల జాతరకు ముందు గుట్ట గడ్డిని సేకరించి తీసుకువచ్చి గుడిపై వేయడం, మట్టితో అమ్మవారి గద్దెలను అ లకడం, గుడిమెలిగే పండుగను సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మినీ జాతరను నిర్వహించి మరుసటి ఏడాది మహాజాతరను నిర్వహిస్తూ వస్తున్నారు.logo